ఈ రాత్రి నీకు బహుమతి 22
దారి చూపించడానికే చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నట్టు దారంతా వెన్నెల పరుచుకుని వుంది. గాలి ఎక్కడో భయపడడం వల్ల చల్లబడిపోయినట్టు చలి పెడుతోంది. దూరంగా వున్న వూరు లైట్ల కాంతిలో వెలుగుల నదిలో కదలకుండా నిలబడిపోయిన దీపపు దొన్నెలా కనిపిస్తోంది.
ఎందుకయినా మంచిదని పొలాలగుండా కాకుండా ఏటిపక్కనున్న కాలిబాటన బయల్దేరింది లిఖిత.
"నేను తోడొచ్చి దిగబెడతానమ్మా..." అని గిరిజ భర్త అన్నా వద్దంది. ఎందుకనో ఇప్పుడు ఎవరినీ భరించే స్థితిలో లేదామె. ఒంటరితనమే మధురంగా వుంది. అది ప్రేమ లక్షణమేమోనని చాలాసార్లు తనలో తనే అనుకుంది.
ఆమె ఎస్.టి.కాలనీ దాటింది.
భూమి అంతా ఏరే ఆక్రమించుకున్నట్టు ఆ ప్రాంతమంతా ఇసుకతో నిండి వుంది. గుబురు పొదలు రోడ్డును ఇరుకు చేస్తున్నట్టు విస్తరించి వున్నాయి. దూరంగా రైల్వే బ్రిడ్జి వెన్నెల్లో మసగ్గా కనిపిస్తోంది.
ఆమె నడుస్తున్నదల్లా ఠక్కున ఆగింది.
భయం ఒంటిని ఝల్లుమనిపించింది.
కళ్ళను సాగదీసి చూసింది.
ఏదో నల్లటి ఆకారం కల్వర్టుమీద కూర్చుని వుంది.
అక్కడే స్మశానం వుండడంతో తెలియకుండానే భయం గుండెల్లో దూరింది. తీతువుపిట్ట అరుస్తున్నట్టుంది. ప్రక్రుతంతా నిశ్చలంగా నిలబడి పోయినట్టు చెట్ల ఆకుల రెపరెపలు కూడా లేవు.
అంతవరకు తోడుగా వున్న గాలి తనను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయినట్టు ఉక్కపోస్తోంది.
దూరంగా వుండి గమనిస్తుండడం వల్ల ఆ ఆకారం ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు.