ఈ రాత్రి నీకు బహుమతి 17
ఎగిరి దాటాడు.
ఇసుకలో పడిన పాదం మెలికపడి నొప్పి పుట్టింది.
గట్టు ఎక్కుతున్నాడు.
పాదం వేశాడో లేదో ఏదో సర్రున కదిలిన శబ్దం మరో అడుగు వేశాడు. ఈసారి శబ్దంతో పాటు పాదాన్ని ఏదో పట్టుకుని కొరికింది.
అతను ఆగాడు.
పాదాన్ని ఎత్తి పట్టుకుని చూశాడు.
కొరికినచోట మంట ప్రారంభమై రక్తంలో కలిసిపోతుంది.
అతనికి ఏదో అనుమానం వచ్చింది.
అటూ ఇటూ చూశాడు.
మళ్ళీ కదిలిన చప్పుడు. ముళ్ళ పొదలోకి పోతున్న పాము తోక కనపడింది.
అతని అనుమానం నిజమైంది.
అంటే పాము కరిచిందన్న మాట.
అది నిజంగా పామో కాదో, అది తనను కరిచిందో లేదో నిర్దారించుకునేందుకు ఆగలేదు అతను. కారణం పన్నెండు గంటలకల్లా ఊరికి చేరుకోవాలి.