వెన్నెల సోకని పున్నమి 1
telugu stories kathalu novels వెన్నెల సోకని పున్నమి 1 వెనకబడిన తెగల అభివృద్ధికోసం పనిచేసే కేంద్రప్రభుత్వ సంస్థలో కొత్తగావచ్చిన ఉద్యోగం..!
మేం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ట్రైనింగ్‌ని ఆ వెనకబడిన ప్రాంతాల్లోనే ఇప్పించాలని మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్తున్నారు.
సిటీల్ని దాటుతూ వెళ్తోంది బస్సు. నాగరిక మనుషులూ, వాహనాలు, నున్నని రోడ్లు,.. ఒక్కొక్కటిగా పల్చబడుతున్నాయి. వాటన్నిటినీ పూడుస్తూ.. పచ్చని చెట్లు, పిట్టల అరుపులు, దారిపక్కల వాననీటి వాగులూ..!
ఒత్తైన పచ్చదనాన్ని చూస్తుంటే కళ్ళకి హాయిగా ఉంది.
నాకు ఈ ఉద్యోగం రాగానే కొందరు అభినందించారు. మరికొందరు మాత్రం.. 'అబ్బో.. ఎప్పుడూ విలేజెస్‌కి తిరుగుతూ ఉండాల్సిన ఉద్యోగం..' అని నిరుత్సాహపరిచారు.
బస్సు స్లో అయ్యింది. ఆలోచనల్లోంచి కిటికీలోకి దూకింది నా దృష్టి.
మార్కెట్..! కూరగాయలూ, పళ్ళూ, తేనె, చీపుళ్ళూ, చింతకాయలూ, వగైరాల్ని గుట్టలుగా పెట్టి అమ్ముతున్నారు. పళ్ళూ, కూరగాయల్లాంటివి బ్రైట్కలర్స్తో నిగనిగలాడుతూ లేవు. అన్నీ వాటి సహజరంగూ రూపుల్తో నేచురల్‌గా ఉన్నాయి.
అమ్మకానికి పెట్టిన గుట్టలముందు గుంపులుగా నిలబడున్నారు మనుషులు.. వెనకబడిన మనుషులు.. వెనకబడిన తెగల మనుషులు..!
అది రోడ్డని, బస్సెళ్ళడానికి అడ్డుగా ఉన్నామని, ఏ స్పృహాలేకుండా వస్తువులనే చూస్తూ బేరాలాడుతున్నారు.
బస్సు డ్రైవరుకి ఇది అలవాటేనన్నట్టు అసహనమేం లేకుండా హారన్మీద చేతినుంచి, 'బొయ్య్య్య్' మని మోగిస్తూనే ఉన్నాడు. చెవులు పగిలిపోయే ఆ మోతకీ వాళ్ళలో చలనంలేదు. నాకు ఒక్కసారిగ.. నా స్కూటీకి అడ్డంపడే జీవాలు గుర్తొచ్చాయి.