telugu stories kathalu novels books వెన్నెల రాత్రి 2
“ఇంతకీ ఎవరామె?” రహస్యంగా అర్దిస్తున్నట్లడిగాడు.
“పేరు మాత్రమే చెప్పగలను. ప్రస్తుతానికింతే” అని ఓ క్షణం ఆగి “పేరు శశిరేఖ” అంది.
వెన్నెలంతా తన గుండెల్లో పరుచుకున్నట్లు అతను అనుభూతికి లోనయ్యాడు ‘శశిరేఖ’ – ఆ అక్షరాలను మనసులో రాసుకుంటున్నట్లు పెదవులను ఆడించాడు.
ఇదంతా దొంగచాటుగా గమనిస్తున్న మరో వ్యక్తి కూడా అటువేపు కదిలింది.
శశిరేఖను రక్షించుకోవడం కోసం ఆ వ్యక్తి ఆమె దగ్గరికి త్వర త్వరగా అడుగులేసింది.
* * * *
సురేష్ వర్మకు నిద్రరావడం లేదు. మామూలుగా అయితే ఓ పుస్తకం చదువుతూ అలా నిద్రలోకి జారిపోయేవాడు. కానీ ఎందుకనో ఆరోజు పుస్తకం మీదకి దృష్టిపోవడంలేదు.
కళ్ల ముందునుంచి శశిరేఖ రూపం చెదిరిపోవడంలేదు.
శ్రీశ్రీ గేయం గుర్తుకొస్తోంది.
వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలలో, దారికాని దారులలో, కానరాని కాంక్షలలో దేనికొరకు, దేనికొరకు దేవులాడుతావ్? ఏం కావాలి తనకు?
ఆమె నుంచి ఏం కోరుకుంటున్నాడతను? కానీ విషాదమేమిటంటే, మనం ఎదుటివ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నామో తెలియకపోవడమే. తనకూ అంతే. ఏమిటో దానికి తన దగ్గరా జవాబులేదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడాలని వుంది. తనతో గడపాలని వుంది. ఎండ, వానా, పగలూ, రాత్రీ, చలీ, ఇలా ప్రకృతి మార్పులన్నీ తనతో పంచుకోవాలనుంది.
గ్రీష్మం నుంచి వసంతం వరకు ప్రతి రుతువునూ తనతో అనుభవించాలనుంది. తనతో నవ్వాలనుంది. తనతో కలిసి ఏడ్వాలనుంది. తనతో కవిత్వం చెప్పించుకోవాలనుంది. కవిత్వం చెప్పాలనుంది. తనతో ప్రపంచమంతా రివ్వుమని చుట్టి రావాలనుంది.
అదేసమయంలో తనతో ఏ అడవిలోనో చిన్న కుటీరంలో జీవితాంతం ఉండిపోవాలనుంది.
ఇలా అనిపించడాన్ని ఏమంటారు?
ప్రేమా? ఆకర్షణా, మోహమా, శృంగారమా?
ఏమని పిలవాలీ దీన్ని.
మొత్తానికి తనకి ఆమె ధ్యాస తప్ప మరొకటి లేకుండా బతకాలనుంది. కానీ అదెలాసాధ్యం?
ఆమెకు పెళ్లయింది. మరి పిల్లలున్నారో లేదో తెలియడంలేదు. ఆమెమీద తన అధికారం ఏమిటి?
అతనికా సమయంలో ఏమీ తెలియడం లేదు. తనమీద తనకే జాలి లాంటిది కలుగుతోంది.
అతనికి ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ గుర్తొచ్చింది. నాలుగో తరగతి, అయిదో తరగతి చదివేరోజుల్లో ఎవరైనా కథలు చెబుతుంటే అవి నిజంగా జరుగుతున్నయని భావించి వాటికి కలిగిన కష్టం గురించి ఏడ్చేసేశాడు. పులీ ఆవు కథ విన్నప్పుడైతే అతని బాధ వర్ణనాతీతం. … ఎలాగైనా ఆవుతోపాటు అడవికివెళ్ళి ఆవును వదిలెయ్యమని, దానికో చిన్నదూడ వుందని చెప్పాలని తెగ తాపత్రయపడిపోయేవాడు.
అది కథ అని, అలాంటి ఆవుకానీ, పులీకానీ లేవనీ తల్లి ఎంత చెప్పినా వినలేదు. కొంచెం పెద్దయ్యాక అంత అమాయకత్వంలేదు గానీ, ఆ పాత్రలు నిజమని నమ్మినంత గాఢంగా ఫీలయ్యేవాడు. కథ విన్న చాలా రోజులవరకు ఆ పాత్రలే కళ్లముంది మెదిలేవి. ఇప్పుడు తన స్థితిలాంటిదే గతంలో ఓ తిప్పడు ఎదుర్కొన్నాడు. ఆ కథ ఇప్పుడు గుర్తొస్తోంది.
ఓ రాజ్యాన్ని రాజు పాలిస్తుంటాడు. ఆయనకి పద్దెనిమిదిమంది భార్యలు. చిన్న భార్య చాలా సౌందర్యరాశి.
రాజు అంతఃపురంలో బట్టలు ఉతికేందుకు తిప్పడు అనే వాడొకడుంటాడు. వాడు అనుకోకుండా ఓరోజు చిన్నరాణీని చూస్తాడు. ఆమె అందానికి దాసుడయి పోతాడు. అయినా ఇద్దరికీ ఎంత భేదం?
మొహానికి అదంతా ఏం తెలుసు?
ఇత తిప్పడు ఆమెమీది కోరికతో సన్నగా అయిపోతాడు. ఆ తరువాత కథ చాలానే వుంది. ప్రస్తుతం తను కూడా వాడిలాగా అయిపోయాడు. లేకుంటే ఇంతమంది అమ్మాయిలుండగా, తనకు ఆమెమీద కోరిక కలగడమేమిటి? పాపం మానస – తనకోసమే యవ్వనాన్నంతా అలా దాచి పెట్టుకుని కూర్చుంది.
కానీ అదేమిటో ఈ మనసు? ఆమెమీదకి పోవడంలేదు. తను ఇప్పుడంటే ఇప్పుడు శ్రీనివాసరావు, మానసతో ఘనంగా పెళ్లి జరిపించేస్తాడు. కానీ మానసను చూస్తే తనకెందుకో ఏ ఫీలింగూ కలగదు. పోనీ మానసకు ఏం తక్కువంటే తన దగ్గర సమాధానమేమీలేదు.
ఈ రేఖను చూస్తూనే స్పందించినంత హృదయం మానస దగ్గర అలా ముడుచుకుపోతుందేమిటి? యాడ్లర్ గానీ, యూంగ్ గానీ ఎవరూ జవాబు చెప్పలేదు. తన మనస్సు గురించి తనకే తెలియనప్పుడు వాళ్లకెలా తెలుస్తుంది?
శశిరేఖ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికన్నట్లు డాబామీద కొచ్చాడు.
పిండారబోసినట్లు వెన్నెల. నూర్పిళ్లు అయిపోవడంతో పొలాలన్నీ బీడుగా వెన్నెల్లో ముగ్గుపిండి గాలికి రేగుతున్నట్లు కన్పిస్తున్నాయి. ఈ వెన్నెల్లో దూరంగా పొలాలమధ్య శశిరేఖతో వెన్నెల కుప్పలాట లాడితే ఎలా వుంటుంది?
మళ్లీ శశిరేఖ కిందనుంచి పైకొచ్చినా వీడని తలుపులు. ఎలా భరించడం?
బాబు కిందనుంచి పరుపుతెచ్చి వేశాడు. మళ్లీవెళ్ళి ఈసారి దిళ్ళూ దుప్పట్లూ తెచ్చి పరిచాడు!
ఇక మిగిలింది బాబుతో మాట్లాడటం. అలా అయినా శశిరేఖ ఆలోచనలనుంచి తప్పించుకోవచ్చని బాబుని పిలిచాడు.
“ఇలా కూర్చోరా కాసేపూ”
“అలాగే” నంటూ వాడు కూర్చున్నాడు.
“ఏరా! నువ్వో నిజం చెప్పాల్రా” పరుపుమీద కూర్చుంటూ అడిగాడు.
“ఏమిటండీ?”
“నువ్వెవరినైనా ప్రేమించావురా?”
వాడు ఓ మారు ఉలిక్కిపడ్డాడు. అలాంటి ప్రశ్నలడుగుతాడని వూహించలేదు. ” ఎందుకలా అడిగారు. కారణమేమైనా వుందా……?” అన్నాడు.
“అదంతా నీకెందుకురా – ముందు జవాబు చెప్పు” అన్నాడు సురేష్ వర్మ.
“లేదు. ప్రేమంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. పోనీ ప్రేమంటే అందరికంటే ఎక్కువ ఇష్టమనుకుంటే అలాంటి యిష్టం ఎవరి మీదా కలగలేదయ్యా.”
‘మరి నీ భార్యంటే?’
“అలాంటివేమీ లేవు. కలిసి కాపురం చేస్తున్నాం. అంతే – అసలు మాకా ఆలోచనే రాకుండా పెళ్లి అయిపోయింది. నాకిప్పుడు ముప్పైదాకా వుంటాయనుకుంటాను. ఎనిమిది సంవత్సరాలక్రితం అంటే నాకు ఇరవై రెండున్నప్పుడు మా నాయన ఓరోజు పిలిచి ‘ఒరేయ్ నీకు పెళ్లిరా’ అన్నాడు. పక్కనున్న మా అమ్మ పెళ్లికూతురి వివరాలు చెప్పింది.”
“అంటే – నువ్వు పెళ్లిచూపులక్కూడా వెళ్లలేదన్నమాట.”
“ఉహూఁ! అమ్మానాయన చూడడమే. పెద్దవాళ్లకి తెలియదా అనుకుని సరేనంటూ తలాడించాను”
“పెళ్ళిపీటల మీదనేనా ఆమెను చూడడం” అని అడిగాడు సురేష్ వర్మ.
“ఆఁ! నుదుటున బాసికం, పెద్ద అంచుతో గాడీరంగులో వున్న పట్టుచీర, మెడనిండా నగలు – ముఖమే సరిగా కనిపించలేదు. బావుందిలే అనుకున్నాను.”
“ఈ ఎనిమిదేళ్ళ సంసారం……?”
బాబు అతని మాటలకు మధ్యలో అడ్డు తగిలాడు. ” బావుందా అని అడుగుతున్నారా? బావుందోలేదో కూడా నాకు తెలియదు. అంతమాట ఎప్పుడూ ఆలోచించలేదు కూడా” అన్నాడు.
అందుకే వాడు హ్యాపీగా వుంటాడనిపించింది సురేష్ వర్మకి. వాడు దేన్నీ సీరియస్ గా తీసుకోడు. శరీరం ఎలా చెబితే అది చేస్తాడు. జీవితం జీవించడానికే. వాడే ఒక విధంగా కరెక్ట్! ఇలా సంఘర్షించుకోవడాలూ, సందేహించుకోడాలూ వుండవు.
“బాబుగారూ! నా మాట వినండి” బాబు కాసేపు మౌనం తరువాత అన్నాడు.
“ఏమిట్రా?”
“మానసమ్మకు మీరంటే పడి చచ్చిపోతుంది. ఆమె మీమీద చూపించే ఇంట్రెస్ట్ చూసే బహుశా ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాను.
మీరంటే ఆయమ్మకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఆమెను పెళ్లిచేసుకోండి. అమ్మగారు కూడా ఎంతో సంతోషిస్తారు.”
“నాకామెను చూస్తే ఏ భావనా కలగడంలేదురా” అన్నాడు సురేష్.
“మాకంతా కలిగిందా? పెళ్లి చేసుకుంటే అదే కలుగుతుంది” వాడు మధ్యలోనే దూరి అతను చెప్పేదాన్ని ఖండించాడు.
వాడు చెప్పింది నిజమేననిపించింది సురేష్ వర్మకి. అయినా తనమీద ప్రేమ కలగకుండా, తనతో గడపాలన్న గాఢమైన కోరిక లేకుండా ఎలా పెళ్లి చేసుకోవడం? సాయంకాలం ఓ పూట సరదాగా గడపడానికే మనం మనకు నచ్చిన స్నేహితుడి దగ్గరకు వెళతాం తప్ప, ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళతామా?
“సరేలేరా! ఇది ఇప్పుడు ఈ క్షణాన మనిద్దరిమధ్యా తెగే విషయంకాదు గానీ వెళ్లిరా. రేపు నేరుగా మావిడితోటకే వెళ్లిపో. నేను నిదానంగా వస్తాను.”
“అలాగే!”
వాడు వెళ్ళిపోయాడు.
రాత్రి అలస్యంగా పడుకోవడంతో మరుసటిరోజు ఉదయం పది గంటలకి నిద్ర లేచాడు.
నిద్ర లేస్తూనే శశిరేఖ గుర్తొచ్చింది.
కలల్లో కూడా అమే. కల అంతా ఏదో జీవపదార్దం సాగినట్టు స్పష్టత లేకుండా సాగింది. కానీ తనమీద అమె ఎంత ప్రభావం చూపుతుందో తెలిసింది.
అమెను తలుచుకోగానే కొత్త ఉత్సాహం వచ్చింది. అమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. తనకున్న స్టార్ ప్లస్ మరియు స్టార్ మూవిస్ ఛానల్ బాబు ఒక్కడే. వాడు ఈపాటికి మామిడితోటకు మందు కొట్టిస్తూ వుంటాడు. తనూ అక్కడికే వెళితే, కాలక్షేపంతోపాటు వివరాలు కూడా తెలుస్తాయి. ఈ ఊహతోనే కొత్త ఉత్సాహం వచ్చింది.
నిద్రపడక మీదనుంచి లేచి తయారయ్యాడు. టిఫిన్ తిన్నాక మామిడితోటకు బయల్దేరాడు.
“మధ్యాహ్నంకూడా రాను, నాకూ బాబుకూ క్యారియర్ పంపించు” అని చెప్పాడు తల్లితో.
అతను మామిడితోటకు చేరుకునేటప్పటికి పదకొండు గంటలైంది. ఎండ ఎక్కువైపోయి, కళ్ళను చీలుస్తున్నట్లు ఎండమావులు దారాలు దారాలుగా కనిపిస్తున్నాయి. బంగారాన్ని కాలుస్తున్న కొలిమిలా వుంది అకాశం. పక్షులు ప్రాణాల్ని రెక్కల్లో పెట్టుకొని చల్లని ప్రదేశంకోసం సాగుతున్నాయి. జోరిగల రొద మొత్తం మామిడితోటనంతా ఓ స్పికర్ కింద మార్చేశాయి.
సురేష్ ను చూడగానే బాబు పరుగున ఎదురొచ్చాడు
“పనెలా జరుగుతోందిరా?”
కంచెపని జరుగుతోంది. దాంత పాటు రంగడు, శీను చెట్లుక మందు కొడ్తున్నారు.
ఇద్దరూ నడుచుకుంటూ పని జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి కొంత సేపు అక్కడే వుండి తిరిగి బయల్దేరారు. తోట మొదట్లో ఓ చిన్న పెంకుటిల్లు వుంది.
చాలా ఏళ్ళనాటిది. కాలం అంచున నిలబడి ఎప్పుడో పడిపోయేటట్లుగా వుంటుంది. లోపల మంచం, దానిమీద దుప్పట్లూ, దిళ్ళూ వుంటాయి. తినడానికి ప్లేట్లూ, గ్లాస్ లు లాంటివి మరికొన్ని వున్నాయి.
ఆ ఇంటి ముందున్న ఓ చెట్టు నీడలో కుర్చీ వేయించుకుని కూర్చున్నాడు సురేష్ వర్మ. “నువ్వూ కూర్చోరా. పని జరగడం ఇక్కడ్నుంచి కనిపిస్తోందికదా?”
“సరేలెండి.” అంటూ వాడు ఎదురుగా టవల్ పరుచుకుని కూర్చున్నాడు.
“ఏమిట్రా విశేషాలు?” బాబుని మెల్లగా మొగ్గులోకి దింపాలి. డైరెక్టుగా శశిరేఖ గురించి అడిగితే వాడు కనిపెట్టేసే ప్రమాదం వుంది. అందుకే మాటల్ని ప్రారంభించాడు సురేష్ వర్మ.
“విశేషాలా”? విశేషాలంటే చాలానే వున్నాయండి. బ్రాందీ సీసాలు ఊర్లలో అమ్మకూడదని ఈ మధ్య అందరూ నిర్ణయించిన విషయం దగ్గర నుంచి, చంద్రయ్యది మామూలు చావుకాదని రంగంలో చెప్పిన విషయం వరకు చాలానే వున్నాయయ్యా”
“మామూలు చావు కాదుంటే?”
“చంపేశారటండి”
” అంటే హత్య?”
“అదేనటండి! రంగంలో చెప్పారు”
” రంగమా? అదేమిట్రా?” సురేష్ వర్మకు దాని గురించి తెలియదు.
“రంగమంటే తెలియకపోవడమేమిటి?” మన వూర్లో ఎవరు చచ్చిపోయినా రంగానికి పోతారుకదా”
“నిజంగా నాకు తెలియదురా”
“అయితే వినండి” అంటూ ప్రారంభించాడు బాబు.
“చంద్రయ్య మీకు తెలుసుగా?” మధ్యలో బ్రేక్ వేసినట్టు కాసేపు ఆగాడు.
“చంద్రయ్య అంటే కాటన్ ముల్లులో పనిచేసేవాడు కథా?” అని అడిగాడు సురేష్ వర్మ.
” ఆ అతనే! ఈ మధ్య ఓ రోజు మిల్లు నుంచి తిరిగివస్తూ దారిలోనే చనిపోయాడు.”
” ఆ. అతనే! ఈ మధ్య ఓరోజు మిల్లు నుంచి తిరిగివస్తూ దారిలోనే చనిపోయాడు.”
” ముండేమో సైకిల్ తో వస్తూ మధ్యలో గుండెల్లోనొప్పి వచ్చిందని , అలా కిందపడిపోయాడని ప్రాణం పోయిందని చెప్పాడు. రోడ్డు పక్కన ఆ సమయంలో ఓ పాప గేదెల్ని మేపుతూ వుంది. అమే ఈ కథంతా చెప్పింది. మొదట్లో అందరూ దీన్ని నమ్మారు కూడా. కర్మక్రియలు కూడా జరిగిపోయాయి. ఆ తరువాతే మొదలయ్యాయి గుసగుసలు.”
” గుసగుసలా?” అన్నాడు సురేష్.
“ఆ చంద్రయ్య భార్య జయలలిత వుంది కదా! అమె మీదే అందరి డౌట్. చంద్రయ్యకు బహు డబ్బుపిచ్చి. జీతాన్ని వడ్డీలకు తిప్పి, బాగానే సంపాదించాడు. వడ్డీ ఇస్తానంటే భార్యనైనా ఇచ్చేస్తాడని అనేవారు.
అంత లోభి ప్రపంచంలో వుండడనుకో. ఇలాంటివారితో ఏ భార్య అయినా మనస్పూర్తిగా కాపురం చేస్తుందా? అమె మీద చాలా అభాండాలున్నాయి. నిజమెంతో ఆ భగవంతుడికి తెలియాలి.
” తరువాత” అడిగాడు సురేష్ వర్మ.
” రంగం పెట్టెవాళ్ళు మన ప్రాంతంలో బుచ్చినాయుడు కండ్రికలో వున్నారు. తొలుత చంద్రయ్య అన్న గురవయ్య వెళ్ళి తన తమ్ముడి చావు మీద రంగం పెట్టాలన్నాడు. ఆ రంగం పెట్టే ఆయన పేరు వెంకటేశ్వర్లు. సరేనని ఆయన ఒప్పుకుని వారం రోజుల తరువాత కరెక్టుగా అదివారం రమ్మన్నాడు”
” అడిగిన రోజే చెప్పరన్నమాట” సందేహంగా అడిగాడు సురేష్.
“ఖాళీ వుండద్దూ! డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతోనే చూస్తాడా? ఫలానా రోజు రమ్మంటాడు. గదా. లేదా టోకెన్ తీసుకుని వేచి చూడద్దూ. ఇదీ అంతే. ఆ ఏం చెబుతున్నాను?” అడిగాడు బాబు.
“అదేరా- అదివారం రమ్మన్నాడు.
“అదివారం ఉదయం అందరూ బయలుదేరారు. చంద్రయ్య తల్లి. తండ్రులు , గురవయ్య, ఆయన భార్య కళావతి. చంద్రయ్య చిన్నాన్న, పిన్నమ్మ, తమ్ముళ్ళు, వాళ్ళ భార్యలు మొత్తం పదిహేనుమంది దాకా తేలారు. గురవయ్యకు, నాకు స్నేహం గదా- నన్నూ రమ్మంటే నేనూ వాళ్ళతోపాటే వెళ్ళును.”
మధ్యహ్నానికి బుచ్చినాయుడు కండ్రికకు చేరాం. స్కూల్లో బస. ఎత్తుకెళ్ళిన పచ్చిపులునన్నం తిన్నాం. ఏం పనిలేదు గదా కళ్ళు మూతలు పడ్డాయి.
నిద్రలేచాం. నేనూ , గురవయ్య రంగం చెప్పే వెంకటేశ్వర్లు దగ్గరికి వెళ్ళాం. పెద్ద బోదిల్లు. దినిచుట్టూ సొరపాదులు, గుమ్మడి పాదులు, ఊరికి దూరంగా బయలు ప్రదేశంలో మొత్తం పదిళ్ళు వున్నాయి. అందరూ ఒకే కులంవాళ్ళు. వెంకటేశ్వర్లు తప్ప మిగతవాళ్ళంతా వెదురుబుట్టలు అల్లుతారు అదే జీవనాధారం.
మేము వెళ్ళి మాతోపాటు తెచ్చిన అయిదు కేజీల బియ్యం, యాభై రూపాయలు దక్షిణా పెట్టాం.
క్వార్టర్ బాటిల్ చీఫ్ కి మరో ముఫ్పై రూపాయలు ఎగ్ స్ట్రా. వెంకటేశ్వర్లుకు ఓ అసిస్టెంట్ వున్నాడు. వాడికి చీఫ్ తో కలిసి నూర్రూపాయలు ఇచ్చాం.