telugu stories kathalu వెన్నెల రాత్రి 1 అక్కడెక్కడో దూరంగా వున్న లోకాల నుంచి ఆకాశపుటొడ్డుకు కొట్టుకొచ్చిన గవ్వలా వున్నాడు చంద్రుడు. ఎండకు భయపడి అప్పటి వరకు కాలు బయటపెట్టని గాలి అప్పుడే షికారుకు బయల్దేరినట్టు చల్లగా తగుల్తోంది.
మల్లెపూలు వేసుకున్న పైటను ఎవరో ఆకతాయి లాగేసినట్టు ఆ ప్రదేశమంతా సువాసనలు చుట్టుమడుతున్నాయి.
అక్కడక్కడా విసిరేసినట్టున్న పెంకుటిళ్లు భూదేవి తన పాదాలకు రాసుకున్న గోరింటాకు లతల్లా వున్నాయి. ఇళ్లమధ్య వున్న రహదారి వెన్నెల్లో వెండిపట్టీలా మెరుస్తోంది.
సురేష్ వర్మ మెల్లగా ఆ దారంట నడుస్తున్నాడు. క్ర్గీగంట పరిసరాల్ని గమనిస్తున్నాడు. ఆ వాకిట్లో నిలబడి వుందెవరు? జయంతనుకుంటా – వెన్నెల్లో గోధుమ చేలమధ్యన నిలబడ్డట్టుంది ఆమెను చూస్తుంటే.
బాగా మరగకాచిన పాలరంగు ఆమెది. ఒడ్డూపొడుగుతో మగాడి కేదో సవాల్ విసిరినట్టుంటుంది. అంత భారీమనిషితో పడకటింట్లో యుద్దం చేయడానికి ఆమె భర్త వెంకటేశ్వర్లు ఎంత కష్టపడుతున్నాడో? ఆత్మ విశ్వాసం కాబోలు రోజూ సాయంకాలమైతే కల్లుకొట్టు దగ్గరుంటాడు.
అయినా చదువు అంతంత మాత్రమే వచ్చిన వాడికి జేమ్స్ జాయిస్ యులిసిస్ గ్రంథం ఇచ్చినట్టు పిట్టలా వుండే వెంకటేశ్వర్లుకు జయంతితో పెళ్లేమిటి? అందుకే పెళ్లి చేసేప్పుడూ ముఖ్యంగా ఈడూ జోడూ చూడాలనేది –
“దండాలండి” అన్నారెవరో.
“ఆఁ” అంటూ తలవూపాడు సురేష్ వర్మ.
నీ ఆరోగ్యం ఎలా వుంది అని అడగాలనిపించీ వూరకుండిపోయాను. పాపం రాముడికి సంవత్సరంనుంచీ ఏదో నరాల జబ్బు. నిద్ర లేచేటప్పటికి కాళ్లలోని నరాలన్నీ ఉబ్బిపోతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ వ్యాధేమిటో కూడా తెల్సుకోలేని పేదరికం. అప్పుడెప్పుడో తన దగ్గరికొచ్చి వెయ్యో రెండువేలో తీసుకున్నట్టు గుర్తు.
పాపం – రోజూ కష్టపడ్డా పూటకే గడవని స్థితి. మరి మందులకీ మాకులకీ ఎలా వస్తుంది? ఏ పనీ చేయని పెద్ద పెద్ద రైతులు జ్వరం వచ్చినా త్రీస్టార్’ నర్సింగ్ హోమ్ లకి వెళతారు.
ఎంత దారుణం?
మార్క్స్ చాలా కరెక్టు. పనిచేసేవాడికి తిండి. గోర్బచేవ్ పెరిస్త్రోయికా సాక్షిగా మార్క్సిజమ్ కు దహనసంస్కారాలయిపోయాయి. ఇంకా ఎక్కడున్నాం మనం?
ఆ వస్తున్నది ఎవరు? పద్మ – భర్తనొదిలి పుట్టింటికి వచ్చేసిందని బాబు చెప్పాడు. వాడి ద్వారానే విశేషాలు తెలిసేది. వాడే తనకి ఏకైక టీ. వీ. ఛానెల్. కళ్లకు కట్టినట్టు అన్నీ చెబుతుంటాడు. అయినా ఆ పిల్లేమిటి తనని చూసి అలా సిగ్గుపడింది. తన వయసెక్కడ? ఆ పిల్లవయసెక్కడ? తనకి ముప్పై – ఆ పిల్లకంటే బహుశా పద్దెనిమిది వుంటాయోమో ఆ పిల్ల తత్వమే అంతేనని బాబూ చెప్పాడు.
మగాడైతే చాలు అన్నట్టు ప్రవర్తిస్తుందట. కారణం ఏమైవుంటుంది? కొందరంతే – సంసారం చట్రంలో ఇమడలేరు. హార్మోన్ల సమతుల్యం లోపమా? లేకుంటే డాన్ జ్యూక్ లాంటి మనస్తత్వమా? తన స్త్రీతనాన్ని ఎప్పటికప్పుడు లోకానికి చాటటానికి వచ్చిన మగాడితో రాత్రయితే ఏ గడ్డి వానము చాటునో, ఏ కాశి రాయిమీదనో – ఆ ఐదునిముషాలు మనసులో కాకరపువ్వొత్తుల్ని వెలిగించుకుంటుంది కాబోలు. ఏమో – లోగుట్టు పైనున్న ఫ్రాయిడ్ కెరుక. సాయంకాలమయితే చాలు పెళ్లికూతురిలా తయారయి పోతుంది.
తనెప్పుడు చూసినా ఫుల్ మేకప్ లో కనిపించేది. దట్టంగా, మసక చీకట్లో అయినా తెల్లగా తెలిసేటట్టు పౌడర్ రాసుకుంటుంది. చీకట్లతో పోటీపడే విధంగా కాటుక రాసుకుంటుంది. నుదుటను గుండ్రటి ఎర్రటి స్టిక్కర్ – తలలో లూజుగా కిందకు వదిలేసిన మల్లెపూల దండ – వేళ కాగానే ‘భోజనం తయార్’ అన్న బోర్డును హోటల్ వాళ్లు వీధిలో పెట్టినట్టు – ఆమెను చూసినప్పుడంతా ఆ బోర్డే గుర్తుకొచ్చేది తనకు.
“బాబయ్యా! టైమెంతయిందయ్యా?”
సురేష్ వర్మ ఇ లోకంలోకి జారిపడ్డాడు.ఎవరో ఈ ఊరు మనిషి కాడు- పరాయి ఊరు.
టైమ్ చూసి చెప్పాడు – “ఎనిమిదిన్నర.”
ఆ మనిషి వెళ్లిపోయాడు.
సురేష్ వర్మ తిరిగి బయల్దేరాడు.
అబ్బ ఏమిటంత వెలుగు? కృష్ణారెడ్డి ఇంటి వరండాలో బల్బు కరెంటునంతా తాగి బలిసినట్టుంది. వెన్నెలంతా మేసి ఏరు నిదురోయింది అన్నది మనసులో ఇంకిపోవడంవల్ల ఇలా అనుకున్నానా? ఏమో ఈ ఆలోచనాస్రవంతికి ఏది మూలం? ఏదికాదు? ఎప్పుడు దేనిమీద మనసు పోతుంది? బోర్ ఎందుకు కొడుతుంది?
ఒక్కోసారి ఎందుకంత ఉత్సాహంగా? మరొక్కప్పుడు ఎందుకంత దిగులుగా? ఏదీ అర్దంకాదు సాల్వకార్ డాలీ చిత్రంలాగా, ఏదీ ఒక పట్టాన బోధపడదు. అంతా తికమకే – మకతికే.
కృష్ణారెడ్డి పరమ భక్తుడు. అంత దరిద్రంలో కూడా పూజలకీ, పునస్కారాలకీ లోటు రానివ్వడు. దేవుడు వున్నాడని చెబితే చాలదు. ఆ దేవుడు మెచ్చుకునే విధంగా ప్రవర్తించాలని కందుకూరి వీరేశలింగం కాబోలు అన్నాడు. ఇప్పుడవన్నీ తిరగబడిపోతున్నాయి. కొంతమంది సుఖం కోసం కోట్లమంది కష్టాలు పడుతున్నారు. వోల్టేర్ నుంచి మహా మేధావులంతా చెప్పింది అదేకదా.
కృష్ణారెడ్డి పక్కనున్నది ఎవరూ? వసంత – దామోదరరెడ్డి భార్య. రాత్రయినా పగలయినా ఎప్పుడూ బంగారాన్ని ఒంటి్నిండా దిగేసుకుని కనపడుతుంది. నగల పిచ్చేమో – మెడనుంచి పాదాలవరకు బంగారునగలే. అవన్నీ విప్పేలోపే దామోదర్ రెడ్డి చల్లబడిపోతాడేమో.
అంతేకదా – శరీరాన్ని తాకుతూ నగలని విప్పడం అంటే తమాషానా? ఉద్రేకం వేళ్లకొసల్లో చిట్లి చల్లబడిపోదూ – దామోదర్ రెడ్డి ఎలా భరిస్తున్నాడో ఏమోగాని తనకైతే నగలన్నీ వేసుకున్న స్త్రీలు నచ్చరుగాక నచ్చరు. తనకి స్త్రీ ఎంత సింపుల్ గా వుంటే తనకు అంత ఇష్టం కలుగుతుంది.
తను శాలీనుడు కాబోలు – మరి సుగాత్రి ఎవరు? కళాపుర్ణోదయంలో శాలీనుడికి స్త్రీలలో అలంకారాలు, ఆడంబరాలు, డంబాలు నచ్చవు. అతడి భార్య సుగాత్రి. ఆమెకి అలంకారాలమీద ఓ వీసమెత్తు మోజు.
అందుకనే అతనికి భార్యకంటే ఇష్టం వుండదు. సహజసిద్దంగా వున్నదానిని ప్రేమిస్తాడతను.
ఓ రోజు సుగాత్రి తోటలో వుంటుంది. వర్షానికి తడవడంవల్ల అలంకారాలంతా మాసిపోయి సహజ సౌందర్యంతో మెరిసిపోతూ వుంటుంది. ఆ క్షణంలో ఆమెను చూసిన శాలీనుడు మరులుకొంటాడు. భార్యను కౌగిలించుకుంటాడు – ఎంత మంచి కథ.
మిఠాయికొట్టులో అన్నీ తీపిపదార్దాలే వుంటాయి. వాటిలో వెరైటీ లుంటాయిగానీ అన్నీ స్వీట్లే. అట్లానే ప్రబంధాలు కూడా మిఠాయికొట్లు లాంటివి. కామన్ అయినది శృంగారం. కథలు వేరైనా శృంగారం ఒకటే. వరూధినీ ప్రవరాఖ్యం నుంచి అన్నీ శృంగారప్రధానమే. ఎవరో తన దగ్గరికి వస్తున్నట్టు అన్పించడంతో సురేష్ కళ్లు మరింత సాగదీశాడు. వస్తోంది అతని దగ్గిర పనిచేసే బాబు. “ఏమిట్రా? నా కోసమేనా?”
“ఆఁ అయ్యోరొచ్చాడు – మీకోసం చూస్తున్నాడు.”
“నాకోసం ఎందుకురా – మామూలుగా చేసే తతంగం అంతా పూర్తి చేసేయమని చెప్పు.”
“మీరు రావాల్సిందేనంట.”
బాబు ముందుకు వెళుతుంటే అతనూ వెనకే అడుగులేశాడు. అప్పటి వరకు గోలగోలగా వున్న ఆ ప్రాంతం అతన్ని చూడగానే కాస్తంత సద్దుమణిగింది.
“పూజ ప్రారంభిస్తాను” అయ్యవారు వినయవిధేయతలతో అడిగాడు. “ఆఁ ఒక్కమాట” అంటూ వెళుతున్న ఆయన్ని పిలిచాడు సురేష్ వర్మ.
” చెప్పండి.”
“పూజ పూర్తికావాలంటే ఎంతసేపు పడుతుంది?”
“సుమారు గంట”
“అంత సేపొద్దు – పూజ మొత్తం ఓ అరగంటలో ముగించెయ్ – దక్షిణ రెట్టింపు ఇస్తాను” అన్నాడు.
అయ్యవారి ముఖంలో ఆనందం చిమ్మింది.
“అలాగే – మీరు కోరినట్టే.”
అయ్యవారు గదిలోపలికి వెళ్లాడు.
అంతలో సురేష్ కూర్చోవడానికి ఎదురింట్లోంచి ఓ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు బాబు. పందిట్లో ఓ మూలకు దాన్ని జరిపించి, కూర్చున్నాడు సురేష్ వర్మ.
ఆ రోజు శ్రీరామనవమి. దేవుళ్లూ, దెయ్యాల మీద నమ్మకం లేకపోయినా అతను గత ఐదేళ్ళనుంచి ఈ వేడుకను జరిపిస్తున్నాడు.
వేసవికాలం ఊరుఊరంతా నవమిరోజున గుడి దగ్గరికి రావడం – వెన్నెల్లో అందరూ కలిసి ఆనందంగా గడపడం, చివరికిగుగ్గుళ్లు పెట్టించుకుని తింటూ యింటికెళ్లడం, యివన్నీ బావుంటాయి గనుకే అతనూ తాత ముత్తాతల నుంచి వస్తున్న నవమి ఉత్సవాలను జరిపిస్తున్నాడు.
మొదటిరోజు ఉభయదాత అతనే. ఆ రోజు దేవుడి అలంకరణ మొదలుకొని గుగ్గుళ్లు, పందారం వరకు ఖర్చంతా అతని కుటుంబానిదే. మొత్తం పద్నాలుగు రోజులు నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. చివరి రోజు దేవుడి ఊరేగింపు. రోజుకొకరు ఉభయదాత.
తొలిరోజు ఉత్సవం తనది కాబట్టి సురేష్ వర్మ దేవాలయ పరిసరాలన్నిట్నీ శుభ్రంచేయించాడు. గుడికి వెల్ల చేయించాడు. పోయిన బల్బుల స్థానే కొత్తవి ఏర్పాటు చేశాడు. టేప్ రికార్డర్, స్పీకర్లనూ రిపేరు చేయించాడు.
కొత్తకొత్తగా కన్పిస్తున్న ఆ దేవాలయం వెన్నెల్లో దంతంతో చేసిన రథంలా వుంది. అందులోని శ్రీరాముడు రథంలో ఊరేగుతున్న రాజకుమారుడిలా వున్నాడు.
తొలిరోజు కాబట్టి ఊర్లోని జనం బాగానే వస్తున్నారు. పోగాపోగా గుగ్గుళ్ల పందారానికి తప్ప ముందు జరిగే భజనలకి ఒక్కరు కూడా రారు. ప్రసాదం పెడుతున్నారని తెలిసినప్పుడే పరుగు పరుగున దూకుతారు.
అందులోనూ తొలి ఉభయం సురేష్ వర్మది. కాబట్టి, వెళ్లకుంటే బావుండదన్న ఉద్దేశ్యంతో కూడా అందరూ విధిగా దేవాలయం దగ్గరికి వస్తున్నారు.
ప్రస్తుతానికి సురేష్ వర్మ, కుటుంబం ఆర్దికంగా వెనకపడినప్పటికీ పేరు ప్రతిష్టల్లో మాత్రం ఆ మండలంలో నెంబర్ వన్. అతని తాత సుబ్బరాయవర్మ. అప్పట్లోనే కుబేరుడు. ఆ తర్వాత అతని కొడుకు నారాయణవర్మ స్వాతంత్ర్య సమరంలో ప్రముఖపాత్ర వహించాడు. స్వంత ఆస్థుల్ని సైతం ధారబోశాడు.
ఆ తర్వాత కూడా ఆయన నీతి నియమాలకి కట్టుబడ్డాడుగానీ ఆస్థుల్ని సంపాదించడానికి కాదు.
ఆయనకి ముగ్గురు పిల్లలు. పెద్దవాళ్లు ఇద్దరూ కూతుర్లు, మూడో వాడు సురేష్ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఆస్థుల్నే అమ్మాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ ఆ ఊర్లో భూస్వాములు వాళ్లే.
అయితే భూములే ఆధారం కావడంవల్ల ఆదాయం పెద్దగా రాదు. భూములున్నాయన్న మాటేగాని వాటివల్ల పొంగిపొర్లిపోయే రాబడి మాత్రం లేదు. సురేష్ వర్మకు వ్యవసాయమంటే ఇష్టం. యూనివర్శిటీలో ఎమ్. ఏ. చదివాక యింటికొచ్చి వ్యవసాయం చూసుకునేవాడు.
“వాడొక్కడు. ఉద్యోగం సద్యోగం అంటూ వాడ్ని నా కళ్ల ముందునుంచి మాయంచేయకండి” అని అతని తల్లి అనసూయమ్మ కూడా వంతపాడడంతో నారాయణవర్మ కూడా మరోమాట చెప్పలేకపోయాడు.
తన అక్కయ్యల పెళ్లిళ్లు చేయడం దగ్గర్నుంచి రోజువారీ వ్యవసాయం పనుల వరకు నారాయణ వర్మకి సురేష్ చేదోడు వాదోడుగా వుండేవాడు.
అయిదేళ్ళక్రితం ఆయన కాలం చేశాక మొత్తం భారమంతా సురేష్ వర్మపైనే పడింది. అతను నిజంగానే చాలా డిఫరెంట్ మనిషి. అప్పటి తన సహచరుల్లాగా బోళామనిషి కాదు. ఏదైనాసరే గాఢంగా కోరుకునే వ్యక్తి. పైపై మెరుగులు కాక లోతుల్ని తరచిచూసేవాడు.
కాబట్టి ఏ విషయంలోనైనా అతని అభిప్రాయాలూ, అభిరుచులూ విభిన్నంగా వుండేవి.
తండ్రిపోయిన తరువాత అప్పులన్నిటినీ తీర్చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కయ్యల పెళ్ళిళ్ళ నిమిత్తం చాలనే, ఖర్చయింది.’మోసం – దగాలేని వృత్తి వ్యవసాయం ఒక్కటే అనిపించింది’ అని వ్యవసాయం ప్రారంభించాడు. తండ్రి అమ్మెయ్యగా మిగిలింది అప్పటికి దాదాపు ముప్పై ఎకరాలు. అదిగాక ఐదెకరాల మామిడితోటుంది. ఆ ముప్పై ఎకరాల్లో రకానికి ఒకటిచొప్పున పంటలు వేయడం ప్రారంభించాడు. కూరగాయల తోటలు, పూలతోటల్ని వేశాడు.
మొదటి మూడు సంవత్సరాలకే అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ఆ తరువాత వచ్చే రాబడినంతా భూముల అభివృద్దికి ఖర్చు పెట్టాడు. కష్టాల్లో వున్నవాళ్లకి వీలైనంతగా సహాయం చేస్తుంటాడు. అందుకే ఆ వూర్లో అతనికి మంచి పేరుంది. ఆ పల్లెటూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ టౌన్ వుంది. రోజూ సాయంకాలం బాబును తీసుకుని టౌన్ కి వెళుతూంటాడు.
అతనికి ఇష్టమైనవి రెండే విషయాలు. ఒకటి చదవటం, రెండు సిగరెట్లు కాల్చడం. టౌన్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన మ్యాగజైన్లు, నవలలు కొనుక్కుని తిరిగి వస్తూంటాడు.
తీరిక దొరికినప్పుడు పుస్తకం పట్టుకుని చదవటం తప్ప మరొకటి చేయడు.
అనసూయమ్మ కొడుకు ప్రయోకత్వాన్ని చూసి తనలో తనే మురిసిపోతుంటుంది. ముప్పై ఏళ్లొచ్చినా అతను ఇంకా పెళ్ళి చేసుకోలేదన్న బాధ తప్ప, కొడుకు మీద ఆమెకు ఎటువంటి అసంతృప్తి లేదు.
“చేసుకుంటానులేవే – ఏ అమ్మాయిని చూసినా యింత వరకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలగలేదు. నేనేం చేయను చెప్పు” అని అతను తల్లికి సర్దిచెపుతుంటాడు.
నిజంగానే అతన్ని స్పందనకు గురిచేసే అమ్మాయి ఎక్కడా ఇంతవరకు తారసపడలేదు.
అయ్యవారు పూజ అంతా అయిన తర్వాత చివరగా మంగళ హారతి పట్టుకొచ్చాడు.
“టైమ్ తొమ్మిదయింది. మరి గుగ్గుళ్ళు పందారం ప్రారంభించమంటారా?”బాబు తన అయ్యవారి ముందు వినయంగా వంగి అన్నాడు.
“అప్పుడేనా.. భజన చేయనివ్వండి” సుబ్బారావు అక్కడికి వస్తూ అన్నాడు. ఆయనవైపు చూస్తూ పలకరింపుగా నవ్వి “భజనచేసే ఆ అయిదుమందీ అలిసిపోయినట్టున్నారు” అన్నాడు సురేష్ వర్మ.
“మీ ఉభయం కాబట్టి ఆ అయిదుమందయినా భజన చేస్తున్నారు. రేపట్నుంచీ చూడండి గుగ్గుళ్ళను తప్ప ఒక్కరు రారు” అని ఆపి ఆ తరువాత తను గడిపిన పాత రోజుల్ని గుర్తుకుతెచ్చుకుంటూ “మా కాలంలో అయితే శ్రీరామనవమి ఉత్సవాలంటే పండగస్థాయిలో జరిగేవి. భజన ఏ అర్దరాత్రో ముగిసేది. ఇప్పుడు చూస్తున్నారు కదా భజనకన్నా ముఖ్యం చాలా విషయాలయిపోయాయి” అంటూ నిట్టూర్చాడు సుబ్బారావు.
“పెట్టమను – అంతా ప్రారంభమయ్యేసరికి ఎలా లేదన్నా మరో అరగంట పడుతుంది.”
అయ్యగారి ఆజ్ఞ కావటంతో ఆ ముక్కను గుడి ఆలనాపాలనా చూసే కాంతమ్మతో చెప్పాడు బాబు.
“అప్పుడేనా! సరేలే – ఈ ఊరు ఈ జన్మకు బాగుపడదు” అని శపించి, మరోసారి గుడిని ఊడ్చడంలో నిమగ్నమైంది. ఆమెది వింత మనస్తత్వం. ఎప్పుడూ మడిగట్టుకుని వున్నట్టు మనుషుల్ని, ముఖ్యంగా మగవాళ్లని చూస్తే దూరం దూరంగా జరుగుతుంటుంది.
ఆమెది ఏవూరో ఏవాడో తెలియదు. ఏభై యేళ్లుంటాయి. సరయిన తిండి లేకపోవడంవల్ల కాబోలు ఆ వయసుకే ముసల్దానిలా కనిపిస్తుంది.
గుగ్గుళ్లు పందారం పెట్టడానికి అనువైనవాళ్లు ఎవరున్నారా అని చూస్తున్నాడు బాబు. గుగ్గుళ్ళు పందారం పెట్టాలంటే కూడా దానికీ స్పెషలిస్టులు కావాలి. ప్రతిఏటా ప్రతిఒక్కరి ఉభయానికి ప్రసాదం పంచే పరంధామయ్య ఈమధ్యే కాలం చేశాడు. దాంతో కొత్తవాళ్లని వెతుక్కోవావల్సి వస్తోంది. నారయుడ్ని పందారం పెట్టడానికి పిలుద్దామని అటు వెళ్లాడు బాబు.
పూజ అయిపోవడంతో అయ్యవారు సురేష్ దగ్గరికి వచ్చాడు. ఆయనకు ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చి పంపించేశాడు. ఇంకా ఎందుకు గుగ్గుళ్లు పందారం ప్రారంభించలేదో కనుక్కోవడానికి కుర్చీలోంచి లేచి గుడి మెట్ల దగ్గరికి వచ్చాడు. నారాయుడు ఓ పళ్లెం ఎత్తుకుని పందారం ప్రారంభించాడు.
ఇక మనం ఉండక్కర్లేదనుకుని ఇంటికి బయల్దేరబోతూ పందిట్లో గందరగోళంగా వుంటే చూపు అటువేపు తిప్పాడు సురేష్ వర్మ.
పిల్లలు నారాయుడి మీద పడిపోతున్నారు. జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు. రద్దీ ఎక్కువైంది. నారాయుడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పటికీ తన శక్తిమేర ఎవరు పెట్టించుకున్నారో లేదో చూస్తూ పెడుతున్నాడు. జనాన్నంతా పరిశీలిస్తున్న సురేష్ వర్మ ఓ దగ్గర ఠక్కున ఆగిపోయాడు. విస్మయం లాంటిది ఒంటినంతా జిలకొట్టినట్లయిపోయాడు. అటు నుంచి చూపు మరల్చుకోలేకపోయాడు.
బావిగట్టును ఆనుకుని వున్న ఓ స్త్రీ అతన్ని అలాగేకట్టిపడేసింది. ఆమెను ఇంతకు ముందెన్నడూ చూళ్ళేదు.
వెన్నెల్లో ఆమె అచ్చు కాళిదాసు శకుంతలలా లేదు. మను చరిత్ర వరూధిని అంతకంటే కాదు. పోనీ వసు చరిత్ర గిరిక, విజయ విలాసంలోని ఉలూచి అంతకన్నా కాదు. వీళ్లందర్నీ కలిపి ఓ స్త్రీని చేస్తే ఎలా వుంటుందో అలా వుంది ఆమె. అందం, అంత హుందాతనం, అంత విలాసం ఒక్కరిలో వుండడం అసంభవం.
ఆమె ప్రసదానికి కాకుండా ఏదో పంజరంలోంచి తప్పించుకుని జనం మధ్యలోకి వచ్చినట్టు ఆ పరిసరాల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తల తిప్పుకోలేక పోతున్నాడు సురేష్ వర్మ. ఆమెకి పాతికేళ్ల పైమాటే. సువాసన బరువుకి విచ్చుకున్న మొగలిపువ్వులా వుంది. చామనఛాయ ఆమె అందానికి మరింత ఆకర్షణ ఇచ్చిందేతప్ప రంగు తక్కువున్న భావనను కలగనివ్వడంలేదు.
చాలా దూరానికైనా విశాలంగా కన్పిస్తున్న కళ్లు, అంత పెద్దముఖం లోనూ కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్న ముక్కు, మసకవెన్నెల్లో కూడా ఎర్రషేడ్ ను ప్రతిఫలిస్తున్న పెదవులు, మనిషి భారీగా వున్నా తమ ఉనికిని తెలియజేయటానికే మరింత బరువుగా, బలంగా ఎదిగిన పొంగులు, బావిగట్టు నీడలో అదృశ్యమైపోయిన నడుము –
అతను కళ్లార్పకుండా మరిచిపోయాడు.
నీలంపూవులున్న తెల్లటి కాటన్ చీరలో దృశ్యాదృశ్యంగా కన్పిస్తున్న బొడ్డుకూడా అదోరకం కొత్తపువ్వులా వుంది. ఆమెది ఈ లోకంకాదు. “ఆమె నివాసమ్ము తొలుత గంధర్వలోక మధుర సుషమా సుధాగానమంజు వాటి” అనిపించింది అతనికి. ఆమెమీదే మొహం పెంచుకుని ఆమె కోసమే బ్రతుకై కృష్ణశాస్త్రి అన్నట్లు ‘సగము వాడి విరహతోరణమ్మునై’ కృశించిపోవాలనిపించింది.
ఆమెను మరింత దగ్గరగా చూడాలనిపించి అతను అటువేపు కదిలాడు. జనమంతా గుగ్గుళ్ల మీద పడ్డారు తప్ప అతన్ని ఎవరూ గమనించడం లేదు.
అతను గుడి ముందు వేసున్న పందిట్లోంచి నడిచి, ఎర్రగన్నేరు చెట్లకు చుట్టుకుని మాధవయ్య ఇంటి పెరట్లో వున్న సన్నజాజుల చెట్టుకింద కెళ్లి నిలుచున్నాడు. గాలి తన సహస్ర చేతుల్తో సన్నజాజుల్ని చెరబట్టినట్టు గుప్పున వాసనలు చుట్టుముట్టాయి.
ఇప్పుడామె మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
ఆమె దగ్గరగావెళ్లి ‘ఆరిపేయవే వెన్నెల దీపాన్ని’ అని చెప్పాలన్న గాఢమైన కోరిక అతనికి కలిగింది. ఆమె అందం, ఆకర్షణ అతనిలో మోహావేశాన్ని కలిగించాయి. ఆ క్షణంలో అందరూ ఠక్కున అదృశ్యమైపోయి తను మాత్రమే ఆమెలో లీనమైపోవాలన్నంత బలంగా కౌగిలించుకోవాలనిపించింది.
“ఏమిటయ్యా సురేషూ – అలా చూస్తున్నావ్ – ఎవర్ని?” అతను తల తిప్పి పక్కకి చూశాడు. తన తత్తరపాటునంతా కప్పి పుచ్చుకోవడానికి నవ్వును ముఖమంతా పూసుకున్నాడు. దొంగను పట్టుకున్నట్లు నవ్వుతోంది చింతామణి.
ఆమె అతని పక్కగా వచ్చి “ఆ జామచెట్టు దగ్గర నిలుచున్న ఆమెనా చూస్తోంది. అంతగా ఆకర్షించిందా నిన్ను” అంది బావిగట్టువైపే చూస్తూ.
చింతామణితో అబద్దం చెప్పడం కష్టం. అరవయ్యేళ్ల వయసులో జీవితాన్ని కాచివడబోసిన ఆమె అంటే ఊరికంతకీ భయమే.
ఎటువంటి వ్యక్తినయినా క్షణకాలంలో అంచనావేసే తెలివితేటలూ, అవతల వ్యక్తిని తన బుట్టలో వేసుకునే వాక్చాతుర్యం , ఎక్కడా చిక్కుకు పోని లౌక్యం. ఎవరికైనా సహాయం చేసే ఆమె గుణాలు. అందుకే అందరికీ ఆమె అంటే భయమూ భక్తీ వున్నాయి.
సురేష్ వర్మను సైతం ఏకవచనంతో సంబోధించి అంత క్లోజ్ గా మాట్లాడే ధైర్యం ఆమెకు తప్ప, ఆ ఊర్లో మరెవ్వరికీ లేదు తను చూస్తున్నది ఎవర్నే అంత కరెక్టుగా కనిపెట్టేసేటప్పటికి అతను ఖంగుతిన్నాడు. ఆ సమయంలో ఏం చెప్పాలో నోట మాట రాలేదు.
“వాలుచూపుకో, వలపు మాటకో ఒళ్లోవచ్చి వాలిపోవడానికి ఆమె కన్నెపిల్లేంకాదు. వివాహిత – మరొకరి భార్య” అంది నవ్వుతూనే హెచ్చరిస్తున్న ధోరణిలో.
“పెళ్లయిందా?” నమ్మశక్యంగాలేక మరోసారి అడిగాడు సురేష్ వర్మ.
“ఆ. మూడేళ్ళయింది పెళ్లి జరిగి – మనూరికి కొత్త.”