సుపుత్రుడు 1
telugu stories kathalu novels సుపుత్రుడు 1 మాంఛి ఎండలు.. ఇరక్కాసినయ్..!
చురచురలాడే ఎండలో ఒంటిని చల్లబరుస్తూ చెమట్లు ధారగా కారుతున్నాయి.
నేలమీంచి ఓ రాయందుకుని, జవసత్వాల్ని కూడదీసుకుని, గురిచూసి మామిడి చెట్టుపైకి విసిరాను.
కోపంగా నా వైపు చూసి, కోరపళ్ళతో బెదిరించి, రెండుకాయల్ని తెంపుకుని కొమ్మమీంచి కొమ్మకి దూకుతూ వెళ్ళిపోయింది ఆఖరి పండుకోతి.
మిగిలిన కోతులన్నీ వెళ్ళిపోయాయి. ఈ గద్దరదాన్ని తరిమేసరికి నీరసం ముంచుకొచ్చింది. బహుశ వయసు మీద పడబట్టేమో.. నాలుగడుగులు వేస్తుంటే ఆయాసం, నిలువెల్లా చెమట్లు.
భగభగలాడే మిట్టమధ్యాహ్న వేళకూడా కాసంత కునుకు తియ్యనివ్వకుండా రోజూ ఇదే పనైపోయింది నాకు..! ఉన్న ఎకరం స్థలంలో ఇల్లుపోనూ మిగిలినదాన్ని ఖాళీగా ఉంచడమెందుకని, బంగినపల్లి మామిడి వేశాను. ఈ ఏడాది ఎండల్తో పాటూ మామిడీ ఇరక్కాసింది.
'ఏ కోతీ రాలేదు దేవుడా.. ఇక కాపు మొత్తం నిలబడ్డట్టే. కొడుకూకోడలికీ, మనవలకీ తినే యోగం ఉందిలే. నాలుగు రూపాయలూ కళ్ళజూడొచ్చు..' అనుకున్నాను. ఈలోపే దండుకింద ఊర్లోకి వచ్చేసినియ్. ఏ తోటలోని చెట్టునీ వదలట్లేదంట. కుక్కలున్న తోటల్లో ఐతే చెట్ల చిటారుకొమ్మన నిలిచి కుక్కల్ని వెక్కిరిస్తున్నాయట.
మొన్న చల్లపల్లోళ్ళ పిల్ల వేసవి సెలవలకొచ్చింది. ఆ పిల్ల ఇంట్లోపడి చక్కాకూర్చోక చెట్టెక్కి కాయలు కోసుకుంటుంటే, ఎప్పుడొచ్చిందో ఓ పండుకోతి దాన్ని ఆ చెంపా ఈ చెంపా టపాటపా వాయించేసింది. పాపం పిల్లదాని బుగ్గలు బూరెల్లా ఉబ్బిపోయాయి. నాల్రోజులుగా జడుపుజ్వరంతో తిండీతిప్పలు లేకుండా పడుందా పిల్లది.
ప్రతీరోజూ భోజనం అవగానే విశ్రాంతి లేకుండా ఈ కోతుల్ని తరిమే పనే సరిపోతోంది నాకు.
'నువ్వు రాకపోయినా కనీసం మనవడినో, మనవరాళ్ళనో పంపరా' అని మా పిల్లోడికి ఫోన్ చేస్తే- "పిల్లలు అక్కడికొస్తే పాడైపోతారు. ఐనా ముసలిదానివి.. నీకెందుకే ఈ గొడవంతా