స్పర్శ
naa telugu kathalu స్పర్శ చేతివేళ్ల కొసలకీ భాష తెలుసు. మాటల్లో సూటిగా చెప్పలేని మనసులోని భావాల్ని ఎదుటివాళ్లకి తెలిసేలా ఎంచక్కా అనువదిస్తాయవి. వాసూరావు చేతివేళ్ల కొసలు ఇప్పుడదే పని చేస్తున్నాయి. సిటీ బస్సులో ఎదురుపడ్డ పాతికేళ్ల ప్రాయాన్ని మౌనంగా పలకరిస్తున్నాయి. జర్నీలో పొరపాటున తగిలినట్లు అలవోకగా ఆమెని తాకుతున్నాయి. భిన్న ధృవాల ఆకర్షణలోని విద్యుత్ ప్రకంపనలెప్పుడూ కొత్తగా, మత్తుగా ఉంటాయని. ఒంటిమీదికి వయసొచ్చినప్పట్నుంచీ అతడికి తెలుసు. ముఖంపై మొటిమలు పుట్టుకొచ్చిన మొదట్లోనే ఎదురుపడ్డ ఏ అమ్మాయిని చూసినా అతడి కన్రెప్పలు వాలిపోయేవి. సూటిగా చూసేందుకు బెదిరిపోయేవాడు. తప్పు చేసినట్లు తలదించుకుని తడబడే అడుగుల్తో అక్కడి నుంచీ వడి వడిగా కదిలిపోయేవాడు.
స్కూలు గడపదాటి కాలేజీలో కాలుపెట్టిన తర్వాతే గుండెల్లోకి కాస్త దైర్యం చేరింది. అమ్మాయిల వెనుకెనుకపడుతూ కాలరెత్తుకుని కామెంట్ చేయడంలోని థ్రిల్ అనుభవంలోకి వచ్చింది. మనసెప్పుడైనా తప్పు చేస్తున్నావంటూ మూలిగితే….. ఆ గొంతును బలవంతాన నులిమేసాడే తప్ప కించిత్తయినా పశ్చాత్తాపానికి లోనయ్యేవాడు కాదు.
కాలేజీ డేస్లోని ఫ్రెండ్స్ కూడా అమ్మాయిల్ని కామెంట్ చేయడమే హీరోయిజమనుకున్నారు.
విలనిజమే హీరోయిజమనిపించే రీతిలో హీరోయిన్లను ఏడిపించి..... ప్రేమలో పడేసే సినిమాలే వాళ్లలో ఆ అభిప్రాయం కలగడానికి మరో పరోక్ష కారణం. అమ్మాయిల్ని ఏడిపించడం మొదట్లో సరదా అనిపించినా..... రాన్రానూ వ్యసనంగా మారిపోయింది వాసూరావుకి. కాలేజీ క్యాంపస్లో తనతోపాటు చదువుకునే ఆడపిల్లల్నే కాదు….. అస్సలు పరిచయం లేని వాళ్లని కూడా ఏదో ఒకటి అనడం…. చురుక్కున వాళ్లు చూసేసరికి ఆనందపడడం అలవాటు చేసుకున్నాడు.
ఆ తర్వాత్తర్వాత… . ఆటోలో, బస్సులో రైళ్ళలో ఎదురయ్యే ఆడపిల్లలకు అతి దగ్గరగా నిల్చోవడం.చేయిచేయి తాకించడం గొప్పగా ఫీలయ్యేవాడు. ఎంతమందిలోనైనా….. ఎవ్వరికీ తెలీకుండా ఓ అపరిచితకు చేతివేళ్ల కొసలతో ‘హలో…..’ చెప్పడం. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆమె