రావోయి మా ఇంటికి 7
"నిజమే కానీ - మా నాన్న విషయం నీకు తెలుసుకదా. ప్రతీదీ శాస్త్రోక్తంగా జరగాలంటాడు. అందుకే నెలరోజులు వాయిదా పడింది"
"ఏమిటో మనిషి బతుకు! జీవితం అంత సంక్లిష్టమయింది మరొకటి లేదు. ఒక మనిషి సమస్యలకూ, మరొక మనిషి సమస్యలకూ పొంతన వుండదు. నీ శోభనం ఒక కారణం చేత ఆగిపోతే మరొకరిది మరో సమస్యవల్ల వాయిదా పడుతుంది. శ్రీనిజ అనే మా బంధువుల అమ్మాయిది మరో రకం సమస్య?"
"శ్రీనిజ ఎవరు? ఏమిటామె సమస్య?" సుజన ఉత్సాహంగా అడిగింది.
"శ్రీనిజది మా పక్క ఊరే. మా పెదనాన్న కూతురు. పెద్దనాన్న పెళ్ళి కాగానే అత్తవారింటికి ఇల్లరికానికి వెళ్ళాడు. ఇక అక్కడే సెటిలయిపోయాడు.
ఆయనకీ ఒక్కటే కూతురు శ్రీనిజ. ఇంటర్ వరకు చదువుకుంది. ఆపై చదవటానికి తగిన వసతులు లేకపోవడంతో చదువు మానిపించేశారు. మరో రెండేళ్ళకు ఆమె పెళ్ళి ఫిక్సయింది.
పెళ్ళి కొడుకుది మంగళగిరి. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. పేరు అమర్. చూడటానికి అందంగా స్టయిల్ గా వుండేవాడు.
పెళ్ళయిపోయింది.
అతనికి అమ్మాయిలంటే సిగ్గో, భయమో తెలియడం లేదుగానీ ఆడపిల్లలకు ఆమడ దూరంలో వుండేవాడు. ఎప్పుడయినా ఎవరితోనయినా మాట్లాడాల్సొస్తే వణికిపోయేవాడు. సక్రమంగా నోటంట మాట వచ్చేది కాదు.
ఆడపిల్లలకి ఎదురైనా ఠక్కున తలవంచుకునేవాడు. ఇలాంటతను ఫస్ట్ నైట్ రోజున ఎలా ప్రవర్తిస్తాడో ఊహించు.