రావోయి మా ఇంటికి 5
ఎప్పుడైనా సినిమాకు వెళ్ళినా పేర్లు రాగానే నిద్రపోయి, శుభం అన్న అక్షరాలు వచ్చినప్పుడు ఎవరో తట్టి లేపితే లేస్తాం.
గంగాభవానీ అందరిలోకి మరీ అమాయకపు పిల్ల. ఒక్కర్తో కలిసేది కాదు. తన పని తప్ప మరొకటి పట్టదు. అమాయకత్వం ఆపిల్లకు ఆభరణంలా అమరింది.
ఇలాంటి గంగాభవానీకి పెళ్ళి కుదిరింది. పెళ్ళి కొడుకు ఏదో ఆఫీసులో అటెండర్. పిల్ల టౌన్ లో వుంటుంది కదా అని ఆమె తండ్రి అతనడిగిన అయిదువేలూ కట్నం కింద ఇచ్చాడు. పెళ్ళి చేసి ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నాడు.
మావాడలో ఏ కార్యానికయినా తప్పక వుండేది రేడియో రేడియో అంటే బుల్లి రేడియో కాదు. ఇనుపగద్దల్లా వుండే లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు విన్పిస్తారే అలాంటిదన్న మాట.
ఇలాంటి రేడియో పెట్టి, రెండు మూడు సెట్ల సీరియల్ బల్బులు పెట్టి జామ్ జామ్ అని గంగాభవానీ పెళ్ళి చేశాడు ఆమె నాన్న.
పెళ్ళి కొడుకుదంతా తెచ్చి పెట్టుకున్న స్టయిల్ అని మాకర్ధమైంది. కుడిచేతికి వాచ్ కట్టాడు. తన పేరును పొడి అక్షరాల్లో చెక్కిన ఉంగరం వేసుకున్నాడు. కాళ్ళకు బూట్లు, కళ్ళకు సలువ కళ్ళద్దాలు టిప్ టాప్ గా వున్నాడు పెళ్ళికొడుకు.
టౌన్ లో వుంటున్నానన్న గొప్పలు, ఉద్యోగం చేస్తూ వున్నానన్న గర్వం ప్రతి కదలికలోనూ, మాటలాడే ప్రతి మాటలోనూ కనిపిస్తోంది.
పెళ్ళి అయిపోయిన రాత్రే శోభనం ఏర్పాటైంది. ఎందుకు ఏదో, ఏది ఎందుకో తెలియని గంగాభవానీ జరిగే తంతులన్నీ ఆశ్చర్యంగా చూస్తోందే తప్ప మరే భావాన్నీ బయట పెట్టలేకపోయింది.
ఆ కొత్త వ్యక్తితో ఇంట్లోకి ఎందుకు తోశారో అర్ధంకాక అమాయకంగా చూస్తూ ద్వారం దగ్గర నిలబడిపోయింది. ఓ మూలనున్న కిరోసిన్ దీపం రెక్కలు తెగి ఎగరలేని ఎర్రటి పురుగులా వుంది. నులక మంచం రాక్షసి సాలీడు అల్లిన గూడులా వుంది. దానిమీద పరిచిన రంగు రంగుల దుప్పటి అందంగా వుంది.