రావోయి మా ఇంటికి 3
సుజన కుర్చీలో సర్దుకొని కూర్చుంది. నిరుపమ ఆ జ్ఞాపకాలన్నిటినీ మనసు పొరల్లోంచి బయటికి లాగినట్లు అటూ ఇటూ కదిలి చెప్పటం ప్రారంభించింది.
"నాకు అప్పుడు ఇరవయ్ రెండేళ్ళు. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. పీజీ చెయ్యాలనిపించలేదు. చదువు బోర్ కొట్టేసింది. చదువు బోర్ కొట్టిందంటే మరేదో కావాలనిపిస్తూ వుందన్నమాట. ఏదో తెలియని ఆరాటం ప్రారంభమయింది. ఇదీ అని చెప్పలేను గానీ జీవితంలో ఏదో మార్పు కావాలని కోరుకుంటోంది మనసు. ఎవరితోనో గాఢంగా మాట్లాడాలని, అతని కోసం ఎదురుచూడాలనీ, పిండివంటలు తినిపించాలనీ, వెన్నెల్లో ఆరుబయట మంచం మీద కూర్చుని కబుర్లు చెప్పాలనిపిస్తోంది.
ఎంఏ చదవటానికి ఆర్ధికరీత్యా కూడా కష్టం కావడంతో మా నాన్న కూడా నన్ను బలవంతం చేయలేదు. అమ్మా, నాన్నలకు - నేను, మా అన్నయ్య సంతానం.
మా పొలంకాక మరో అయిదు ఎకరాలు లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు వాడు. వ్యవసాయమే మాకు వృత్తి.
మంచి సంబంధం వచ్చిందని మొదట మా అన్నయ్యకి పెళ్ళి చేసారు. మా వదిన కాపురానికి వచ్చింది. ఆమె నాకంటే రెండేళ్ళు చిన్నది. బాగా కలుపుగోలుగా వుండేది.
మా ఇంట్లో ముందు వరండా కాక రెండే గదులు. మొదటి గది మా అన్నయ్యా వాళ్ళు వాడుకునే వాళ్ళు.