రావోయి మా ఇంటికి 24
పసుపుబట్టల్లో కనిపించడమంటే పెళ్ళి చేసుకోవడం.
అప్పటివరకూ నేను పెళ్ళి గురించి ఆలోచించలేదు. అతనూ ఆలోచించి వుండడు.
కేవలం మా నాన్నకు కోపం తెప్పించే విషయాన్ని ప్రస్తావించ డానికి అలా అని ఉంటాడు.
ఏది ఏమయినా ఆ మాటలు నాలో కొత్త ఆలోచనల్ని రేపాయి.
"మనిద్దరం పెళ్ళి చేసుకుందాం గౌతమ్..." అన్నాను భావావేశాన్ని అణచుకోవడానికన్నట్లు అతని చేయి పట్టుకుంటూ.
"నిజంగానే" ఉద్వేగంతో అడిగాను.
"ఎస్! మనిద్దరం పెళ్ళి చేసుకుందాం"
అలా మేము ప్రేమ నుంచి పెళ్ళి వరకూ వచ్చాం.
అప్పటినుంచీ ఇద్దరం మా పెళ్ళి గురించి కలలు కనేవాళ్ళం.
మా ఇంటిలో టీవీమీద ఎలాంటి ఫ్లవర్ వేజ్ పెట్టాలోనన్న విషయము దగ్గర్నుంచి పుట్టిన పిల్లలకి ఏం పేర్లు పెట్టాలోనన్నంత వరకు అన్ని విషయాలూ మాట్లాడుకునేవాళ్ళం.
ప్రతి సోమవారం కాలేజీకి ఎగగొట్టేదాన్ని.