రావోయి మా ఇంటికి 22
జీపు బయల్దేరింది.
వార్తాపత్రికల్లో తను చదివిన లాకప్ డెత్ లన్నీ గుర్తు వచ్చాయి. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. జీవితంలో మొదటిసారి అతనికి ఏడుపు వచ్చింది.
మరో పదినిముషాలకు జీపు పోలీస్ స్టేషన్ ముందాగింది.
"రేయ్! దిగరా!" ఓ కానిస్టేబుల్ అరిచాడు.
ముందు ముందు జరగబోయే మర్యాదలకు అది నాందిలా అనిపించింది చిట్టిబాబుకి. తన జీవితం ఇంతటితో ఆఖరనిపించింది.
మెల్లగా జీపునుండి దిగాడు. స్టేషన్ ద్వారం దగ్గర ఇద్దరు పోలీసులు తుపాకీలతో నిలుచుని వుండడం చూస్తుంటే అతనికి పై ప్రాణాలు పైనేపోయాయి.
"నడువ్! నడువ్" ఇందాకటి కానిస్టేబుల్ ముల్లుకర్రతో పొడిచినట్లు అరిచాడు.
శరవణన్ అప్పటికే జీపు దిగి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాడు.
చిట్టిబాబు ముందుకి నడిచాడు.
ద్వారం దగ్గరున్న పోలీసులు అతన్ని చూడగానే "ఏమిటి కేసు?" అని అడిగారు.
"మర్డర్" వెనక నడుస్తున్న ఓ కానిస్టేబుల్ చెప్పాడు.