రావోయి మా ఇంటికి 19
"అద్భుతంగా వుందప్పా! దీంతో వాడి తల తిరుగుతుంది. జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వెధవ ఆలోచనలు చేయడు. అలానే చేస్తాం మాప్పిళే" అని వంశీవేపు అడ్మయిరింగ్ గా చూసాడు.
"థాంక్యూ సార్"
"అవును మాప్పిళే నీకు ఫస్ట్ నైట్ జరగలేదు కదా! మరి బాడీ సుజనది కాదని ఎలా చెప్పగలిగావ్?" శరవణన్ తన సందేహాన్ని బయటపెట్టాడు.
"కాసెట్ లోని అమ్మాయి చెస్ట్ మీద ఎడం పక్కన పెద్దపుట్టుమచ్చ వుంది. సుజనకు అలా లేదు. ఇది ఎలా తెలుసంటే" అని ఆగి - "ఫస్ట్ నైట్ జరక్కపోయినా అక్కడవరకు తెలుసు. మేము లవర్స్ కదా! సమయం చిక్కినప్పుడు అంతవరకు అలా చేసేది" చెప్పి సిగ్గుతో తలదించుకున్నాడు వంశీ.
* * * * *
సుజన, లాలస దేవాలయానికి బయల్దేరారు.
ఆరోజు సాయంకాలం సుజన లాలసను ఆహ్వానించింది. ఇంట్లో బోరుగా వుండటం వల్లా, వంశీ కనిపిస్తాడేమోనన్న ఆశవల్లా శివాలయం వరకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. లాలస రాగానే బయల్దేరారు.
వీధిలో నడుస్తుంటే ఎవరెవరో కనిపిస్తున్నారు గానీ వంశీ మాత్రం కనపడడం లేదు. ఎక్కడి కెళ్ళాడో కూడా ఆమె ఊహించుకోలేక పోతోంది.
కిడ్నాప్ ప్లాన్ అందరికీ తెలిసిపోయింది. అక్కయ్యలంతా ఆట పట్టించారు. గడువు కూడా అయిపోతూ వుంది. ఛాలెంజ్ లో నెగ్గమేమోనన్న అనుమానం కూడా మొదలయింది. కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టడంతో ఉత్సాహం తగ్గింది. ఉన్నకొద్దిరోజుల్లో వంశీ మరో ప్లాన్ చేస్తాడో లేదో కూడా తెలియడంలేదు.