రావోయి మా ఇంటికి 18
"ఆఁ ఈ గణేష్ దాదా అంటే తమాషా అనుకున్నావా? అందుకే ఎమ్మెల్యే అంటూ వుంటాడు. నీలాంటివాడు ఒక్కడుంటే ఏకబిగిన మూడు నియోజకవర్గాల్లో గెలిచెయ్యొచ్చు అని లోపలుంది మీ ఆవిడ ఎందుకయినా మంచిదని తాళం వేసి తీసుకొచ్చాను. ఇదిగో తాళం చెవి" గణేష్ దాదా చేయి ముందుకు తోసాడు.
వంశీ తాళం చెవిని తీసుకున్నాడు.
"చాలా థాంక్స్ దాదా రేపువచ్చి ప్రతిఫలాన్ని ద్రవరూపంలో ఇచ్చుకుంటాలే"
"దానిదేముందిలే భయ్యా ఈరోజు ఎంపీ పార్టీకి పిలిచాడు. నాతో పార్టీ చేసుకోవడమంటే భలే సరదాలే. కానీ కిడ్నాపింగ్ వుందని చెప్పి వచ్చేశాను"
"మన ఎంపీకి నీ కంపెనీ సరదాగానే వుంటుందిలే తలలో ఏదయినా వుంటే తెలుస్తుంది ఆ బాధ" శిష్యుడు జోక్ కట్ చేశాడు. కానీ గణేష్ దాదా పట్టించుకోలేదు.
"ఓకే భయ్యా! వస్తాం! లాస్ట్ బస్ కి వెళతాం. కారును ఉదయం మెకానిక్ మనికి ఇచ్చెయ్"
"అలానే"
గణేష్ దాదా, అతని శిష్యుడూ వెళ్ళిపోయారు.
వంశీ సంచిలోని మల్లెపూలని ఓసారి వాసన చూసి ముందుకి కదిలాడు.
తోట మధ్యలోని ఆ ఇల్లు వెన్నెలతో వెల్లచేసినట్లుంది. హాలు మధ్యలో వున్న పాలబల్బ్ కిటికీల్లోంచి కూడా వెలుగును బయటికి చిమ్ముతోంది.
వంశీ దాన్ని సమీపిస్తున్న కొద్దీ మన్మధుడే స్వయంగా వచ్చి తనకు చక్కలిగింతలు పెడుతున్నట్లు అదోలా ఫీలయిపోతున్నాడు.
తాళం చెవితో తాళం తీసి తలుపుని వెనక్కి తోశాడు. హాలు మధ్యలో వున్న వ్యక్తిని చూసి చిన్న జర్క్ ఇచ్చాడు. రక్తమంతా తలలోకి చిమ్మింది.