రావోయి మా ఇంటికి 16
వసంతత్తని పిలిచాను.
"ఆ రూమ్ లో వద్దు - డాబా మీద వెన్నెల" అన్నాను ఒక్క మాటను సిగ్గు చట్రంలో బిగిస్తూ.
ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
మరో అయిదునిముషాలకు పరుపూ, దిండ్లూ డాబా ఎక్కడం చూసాను.
వెన్నెల్లో పడుకోవడం అంత ఇష్టం నాకు.
తొమ్మిదిగంటలకి భోజనాలు ముగిశాయి. మరో గంటపాటు ఒట్టి హడావుడితోనే గడిచిపోయింది.
పదిగంటల ప్రాంతాన పాలగ్లాసుతో నన్ను మెట్ల దగ్గర వదిలి పెట్టింది వసంతత్త.
"శోభనంలో చిటికెడు సిగ్గేస్తేనే అందం. అలాగని సంచీడు సిగ్గు కుమ్మరించావనుకో పాకం చెడుతోంది" అంది చివరి హెచ్చరిక చేస్తూ.
నేను ఆ మాటలకు మరింత సిగ్గుపడి తల పూర్తిగా వంచేసుకుని మెట్లెక్కడం ప్రారంభించాను.
ఆ మెట్లు సరాసరి స్వర్గానికి వేసినట్లు అనిపించడం నాకేం కావాలో తెలియజేస్తోంది.
డాబా మీదకు చేరుకున్నాను.
వెన్నెల నా చుట్టూ పరుచుకున్నట్లయింది.
సిగ్గు బరువుకు మూసుకుపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి లేపాను.