రావోయి మా ఇంటికి 11
ఎవర్నో ఒకరిని ప్రేమించాలి అని అతను గాఢంగా అనుకునే టప్పటికి సుజన కనిపించింది. రకరకాల పువ్వులను నిలువుగా నిలబెట్టి నట్లుండే ఆమెను చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు.
రోజూ ఆమె కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరగానే ఇతనూ తన మోటార్ బైక్ ని బయటికి తీసేశాడు. ఆమెను అతి స్పీడ్ గా క్రాస్ చేసి, హారన్ మోగించేవాడు. బస్సెక్కేవరకు బస్టాప్ ఎదురుగా వున్న టీ బంక్ లో కూర్చుని అదేపనిగా కాఫీలు, సిగరెట్లు తాగుతూ చూపులను నిలబెట్టేవాడు.
తనను ఎవరయినా గమనిస్తున్నారేమోనని పరిశీలించే ఉత్సుకత సాధారణంగా ఎవరికైనా వుంటుంది. కానీ సుజనలాంటి ఏ కొద్దిమందో అలాంటివాటిని అధిగమించి వుంటారు. అందుకే ఆమె అతని ప్రవర్తనను గమనించలేకపోయింది.
ఆమె అలా వున్నా ఇతనేమాత్రం పట్టించుకోలేదు. మామూలు కుర్రాడయితే అంతటితో ఆపేసి వుండేవాడు. కానీ చిట్టిబాబు మాత్రం అలా కాదు. ఏదయినా సరే తనకు అందేవరకు అతను పట్టు వదలడు.
కొన్నిరోజులకి హారన్ మోగించడానికి బదులు "హాయ్" అని వెనకనుంచి పిలవడం మొదలుపెట్టాడు.
అప్పటికి అర్ధమైంది సుజనకు. అతను తను ఎదురింటిలో వుండే వాడని తెలిసింది. అతను శ్రుతిమించకుండా కాస్తంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. దీన్ని అతడు సహించలేకపోయాడు. చిన్నప్పట్నుంచి ఏది కోరుకున్నా క్షణంలో ముందుండేవి. అదే మెంటాలిటీ అతనిలో కంటిన్యూ అయింది.
ఆమె పట్టించుకోక పోవడంతో పట్టుదల మరింతగా పెరిగింది. ఆమెను ఆకర్షించడానికి రకరకాల పద్ధతుల్ని అవలంభించాడు.