రావోయి మా ఇంటికి 1
బెడ్ రూమ్ లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ- అలాగని ఎవరన్నది?
ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్.
తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్ లోకి నెట్టేస్తే- ఏమడిగినా తనుచెప్పబోయేది ఒక పేరే- సు...జ....న....మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి.
జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది.
వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది - సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్ లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్ నైట్ కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!
ఇప్పుడు మంచి ముహూర్తం లేదని ఫస్ట్ నైట్ ని పోస్ట్ పోన్ చేశాడు. భోజనం అంటే వాయిదా వేసే విషయమా? జాస్మిన్లూ, మూన్ లైటూ ఎప్పుడంటే అప్పుడొస్తాయా? గురజాడ కన్యాశుల్కం శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగిపోతున్నాయి. లేకుంటే ఫస్ట్ నైట్ కి కూడా మంచి ముహూర్తాలూ, శాస్త్రాలు, గర్భాదానం మంత్రాలు ఏమిటి? ఖర్చు కాకపోతే.
మామా! నీలాంటి మూర్ఖుడికి అంత తెలివైన, అందమైన అమ్మాయి ఎలా పుట్టింది?" నిజంగా నీకే పుట్టిందా...? పాపం ఉపశమించుగాక - మామ మీద కోపం అత్తమీద చూపించడం ఏమీ బాగాలేదు.