ప్రియుడు
ప్రియుడు అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉంది. మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకూ ఎంతో శ్రమించి ఆ రూంలో అన్ని వస్తువులని సర్దేశాడు. ఇంకా సర్దే సామానులు చాలా ఉండడంతో ఓసారి వాటి వంక చూసి గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు సేద తీరడాని కన్నట్లు పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చులో రిలాక్స్ డ్ గా వెనక్కి తల పెట్టి కళ్ళు మూసుకున్నాడు. రెండు నిముషాలు గడిచాయో లేదో… చేయిని ఎవరో గట్టిగా గిల్లడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
ఎదురుగా తన శ్రీమతి శాంతి నవ్వుతూ కనిపించింది. ఆమె చేతిలో కాఫీ కప్పు చూసే సరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది కుమార్ కి. ఆమె చేతిలోని కాఫీ కప్పుని గబుక్కున అందుకుని రెండు గుక్కలు గటగటా త్రాగేశాడు. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగడంతో అతనిలో కొంచెం ఉత్సాహం ప్రవేశించింది. శాంతి అతని వంక చూస్తూ నవ్వుతూనే… ”ఏమిటీ.. శ్రీవారు అలసిపోయినట్లున్నారు…?” అంది కొంటెగా …
ఆమె వైపు ఓ లుక్కేసి తరువాత భారంగా నిట్టూర్పు విడిచి…”ఇక సర్దడం నా వల్ల కాదు శాంతి. మిగతా పనంతా…నీవే చూసుకోవాలి” కుర్చీలో వెనక్కి వాలి అభ్యర్ధనగా అన్నాడు కుమార్.
”ఆ… ఆ… పప్పులేం ఉడకవ్…? ఈ ఒక్క గదిలో సామాన్లు సర్ధడానికే ఇంత ఆయాసపడిపోతున్నారు అలాంటిది… నేను చేసినంత పని చేస్తే అసలు రెండు మూడు రోజుల వరకు బెడ్డుపైన తిష్ట వేసి ముసుగుతన్నేసుండే వారు…” అంది శాంతి చిరుకోపంగా.
”ఆ… ఏమిటీ… నువ్వు చేసినంత పనా… ఆ మాత్రం పని నేనూ చేయగలను… అయినా… ఆ చిన్న వంటింట్లో సర్థాల్సినంత వస్తువులు ఏమున్నాయి గనుక. అన్నింటినీ ఆటకపైన ఏదో అలా.. అలా సర్దేస్తే సరిపోతుంది. నువ్వు సర్దిన ఆ చిన్న వంట గదికి, నేను సర్దిన ఈ హాలుకి ఏమైనా వ్యత్యాసం వుందా…? అయినా ఎవరైనా వస్తే ముందుగా చూసేది ఆ వంట గదిని కాదు… ఈ హాలుని.. అందుకే ఇంత పెద్ద హాలులో కష్టపడి ఆ సోఫాసెట్లని అందంగా పేర్చి… ఆ డ్రాయింగ్ పెయింట్స్ ని గోడలకి చూడముచ్చటగా అమర్చి… మిగతా వస్తువులన్నింటినీ నీటుగా సర్దేసి… ఎక్కడ ఏ వస్తువు పెడితే హాలు అందంగా కనిపిస్తుందో కనిపెట్టేసాక… నాలో ఉన్న కళాత్మకత దృష్టికి అనుగుణంగా ఈ హాలుని ఇంత సుందరంగా సర్థాను తెలుసా…?
ఇంత చేసినా కూడ నీకు నేనేమీ చేయనివాడిలాగానే కనిపిస్తున్నానా…? రోషంగా అన్నాడు కుమార్. అతని మాటలకి మురిపెంగా నవ్వింది శాంతి…. అతని చేతిలోని కప్పుని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి… చొరవగా అతని తొడలపైన కూర్చుంది. తన మొహాన్ని అతని మొహానికి దగ్గరగా పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ…
”మీరు మీ కళాత్మక దృష్టితో ఎంతోకష్టపడి హాలంతా నీటుగాసర్దేశారని ఇప్పుకుంటున్నాను మహాప్రభూ…! అందుకే నేను కూడా నా కళాత్మక దృష్టితో ఎంతో కష్టపడి… స్టౌ వెలిగించి, దానిపైన గిన్నె పెట్టి, అందులో పాలుపోసి ఇంత చక్కర, కాఫీ పొడి వేసి… వాటితో పాటు మీ పైన నాకు ఉన్న ప్రేమనంతా రంగరించి… కాఫీని అమృతంలా తయారు చేసి తీసుకువచ్చాను…” తన రెండు చేతులని అతని