నల్లని మేఘము జల్లు కురియగా
naa telugu kathalu నల్లని మేఘము జల్లు కురియగా రాత్రి ఎనిమిదిన్నర అవుతోంది... బయట హోరున వర్షం... మిన్నూ మనూ ఏకమయ్యేలా కుంభ వృష్టి! గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కల్ని బలంగా మూసి, బోల్టులు పెట్టి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు నీరద్. ఏమీ తోచక కాజువల్ గా టీవీ ఆన్ చేసి, స్పోర్ట్స్ ఛానెల్ చూస్తున్నా నీరద్ మనసు అన్యమనస్కంగానే ఉంది.
వర్ష ఎలా ఉందో? తనిచ్చిన మెయిల్ చదివి ఉంటుందా? అసలు ఫోన్ లో చెప్పేసి ఉండాల్సిందేమో... అనవసరంగా మెయిల్ ఇచ్చినట్టున్నాడు... పాపం ఎంత హర్ట్ అయిందో ఏమిటో! పువ్వు లాంటి ఆమె హృదయం ఎంతగా నలిగిపోయిందో...
గలగలా సెలయేటి సవ్వడిలా మ్రోగే ఆమె నవ్వులు, మాటల సందడి, తీయగా హాయిగా పాడే కోకిల గొంతు వంటి ఆమె గానస్వనం, పదే పదే మదిలో మెదులుతూ ఉంటే అపరాధభావనతో అతని మనసు కలత చెందగా, అతని ప్రమేయం లేకుండానే అతని కనుకొలకుల నుండి రెండు కన్నీటి ముత్యాలు చెంపల మీదుగా జారిపోయాయి.
విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్న నీరద్ కి భావగీతాలు రాయటం హాబీ. ఆకాశవాణి కేంద్రంలో తనకి తెలిసిన ఒకాయన కోరిక మేరకు ఉగాది సందర్భంగా ఒక వసంత గీతం వ్రాసి ఇచ్చాడు నీరద్. అక్కడే అతనికి ఒక గాయనిగా పరిచయం అయింది వర్ష. లేడీస్ హాస్టల్ లో ఉంటూ, గవర్నమెంట్ స్కూల్ లో మ్యూజిక్ టీచర్ గా పనిచేసే ఆమె ఆకాశవాణి లో లలితగీతాలు ఆలపించేది. సంగీత సాహిత్యాలలో ఇద్దరి అభిరుచులూ ఒక్కటే కావటంతో త్వరగా దగ్గరయ్యారు ఇద్దరూ.
ఆమె ఎవ్వరూ లేని ‘అనాధ’ అని తెలిసిన నీరద్ కి ఆమె మీద కలిగిన కన్సర్న్ ఇద్దరి మధ్యా స్నేహంగా అభివృద్ధి చెంది, అతని పాటలను ఆమె కంపోజ్ చేయటానికో, లేదా చదివిన పుస్తకాల గురించి చర్చించుకోవటానికో తరచుగా కలుసుకునే వారు. అతనుండే గది మేడ పై భాగంలో ఉంటుంది. ఇంటి చుట్టూ తోట, అందులో బెంచీలు ఉంటాయి. అందువలన సాధారణంగా తోటలోనే వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని, పాడుకోవటం, చర్చించుకోవటం చేసే వారు. క్రింది భాగంలో ఉండే ఇంటి యజమానులైన వృద్ధ దంపతులకు కూడా వర్ష వస్తే ఎంతో సరదాగా ఉండేది. లేదా వారాంతాల్లో ఇద్దరూ కలిసి ఔటింగ్ కోసం బీచ్ కో, జూ పార్క్ కో వెళ్ళే వారు. స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో, ఏనాడు విడదీయలేని అనుబంధంగా అమరిపోయిందో తెలిసేలోగా వర్షకు రాజమండ్రికి బదిలీ అయింది. అయినా వీలును బట్టి నెలకో, రెండు నెలలకోసారో కలుసుకుంటున్నారు.
నిజానికి నీరద్ కు కూడా తల్లిదండ్రులు లేరు. తాతయ్యే అతన్ని పెంచాడు. ఊరికి వెళ్ళిన నీరద్ వర్ష విషయం ఆయనతో కదిపి పెళ్ళికి అనుమతి అడగ్గానే పెద్దాయన అగ్గిరాముడై పోయాడు. తల్లీ తండ్రీ ఎవ్వరో తెలియని, కులగోత్రాలు లేని పిల్లని మనవరాలిగా తాను అంగీకరించలేనని, అది కుల ప్రతిష్టకు భంగమనీ, కుటుంబ పరువు ప్రతిష్టలకు అవమానమనీ తెగేసి చెప్పాడు. అంతే కాక, నీరద్ కు వధువుగా తన స్నేహితుడి మనవరాలు ‘సుబ్బలక్ష్మి’ ని ఏనాడో ఖాయం చేసేసానని చెప్పి, ఊరి పెద్ద మనుషులతో