మనసున మనసై 14
telugu stories kathalu novels books మనసున మనసై 14 పదుహేను నిముషాలు పైగా దివాకర్ ఫోనులో మాట్లాడటం జయంతి కనిపెడ్తూనే ఉంది. పని చేస్తూనే మధ్య మధ్య ఓ చూపు దివాకర్ మీద వుంచింది. మాటలు వినపడకపోయినా అతని మొహంలో వెలుగు, అతని హావభావాలు, ఆ పరవశం అది చూసి మనీషాతోనే మాట్లాడుతున్నట్టు గుర్తించింది. ఏదో తెలియని భావంతో జయంతి మనసంతా దిగులు ఆవరించింది.
* * *
'ఏమిట్రా బాబూ అంత అర్జంటుగా మాట్లాడాలి- ఏ విషయం....' ఆదివారం ఉదయం అర్జంటుగా నీతో మాట్లాడాలి అంటూ ఫోను చేసి ఇంట్లో వుండమని దివాకర్ కి చెప్పి వచ్చాడు గోపాలకృష్ణ. కాఫీ మర్యాదలయ్యాక 'చెప్పరా నాయనా ఏమిటంతా సస్పెన్సులో పెడ్తున్నావు' గోపాలకృష్ణ నవ్వాడు. 'ఏం లేదురా బాబూ అలా అంటేగాని ఇంట్లో వుండకుండా ఎటైనా వెళ్ళిపోతానని అలా అన్నాను. ఒక్క ఆదివారం దొరుకుతావు. అదీ సాయంత్రం అయితే, మళ్ళీ ఎటో పోతావుగా...'
'మరి బాచిలర్ గాడ్ని, ఆదివారం సాయంత్రం ఇంట్లో కూచుని టి.వి. సినిమా చూసుకోమంటావేమిటి'
'అందుకే మరి నాల్గు రోజులుగా ప్రయత్నిస్తే ఇవాళ చిక్కావు. బాచిలర్ గాడివనే నీ చుట్టూ మాలాంటి వాళ్ళం తిరుగుతాం-' నర్మగర్భంగా అన్నాడు గోపాలకృష్ణ నాంది ప్రస్తావనగా.
'ఇంకెన్నాళ్ళురా, ఇలా బాచిలర్ గా హాయిగా గడిపేద్దామనుకుంటున్నావు-నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. అందుకే నిన్ను ఓ రాటికి కట్టేసే ప్రయత్నం ఇది'.
'ఏమిట్రా అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు. ఏదో సరిగా చెప్పు'
'సరిగా చెప్పడానికేముందు, ముఫ్ఫై ఏళ్ళొచ్చాయి. ఇంకా పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు? మేమందరం చేసుకున్నాం, నీవే మిగిలావు....' గోపాలకృష్ణ అన్నాడు.
'నా పెళ్ళికి నాకంటే నీకెక్కువ తొందరగా వున్నట్టుంది....'
'సరే ఈ డొంక తిరుగుడంతా ఎందుకుగాని, నీకో సంబంధం తెచ్చాను.....నీవు ఊఁ! అనాలి....'
'సంబంధమా...ఎవరు? ఇది చాలా బాగుంది.... చూడకుండానే ఊ... అనేయమంటావా...' నవ్వాడు తేలిగ్గా దివాకర్.
'చూడటం ఏముంది-రోజూ చూస్తూనే వున్నావుగా జయంతిని...' కొంటెగా అన్నాడు.
'జయంతా...' తెల్లపోతూ అన్నాడు దివాకర్. 'జయంతి గురించా నీవు చెప్తుంది'
'మరెవరనుకున్నావు. నా ఇంట్రస్టు మరి నా భార్య సిస్టర్ అని గదా' దివాకర్ మొహంలో రంగులు మారాయి.
'జయంతికి నీకు ఈడుజోడు కుదిరింది. ఇద్దరిదీ ఒకే ఉద్యోగం. గత మూడు నెలల నించి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. ఫ్యామిలీని కూడా చూశావు. నీకేం అభ్యంతరం లేదంటే వాళ్ళ వాళ్ళు వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడుతారు. మొన్న నిన్ను చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. నీవు ఊఁ! అనడమే తరువాయి...'
'ఓరినీ...అందుకా అంత ప్రేమగా భోజనానికి రమ్మని బలవంతపెట్టావు ఆ ఫంక్షన్ రోజున....ఇంత ముందాలోచనా...'
'ముందాలోచనే గాని, దురాలోచన కాదు కదా....నీలాంటి పెళ్ళికొడుకుని కళ్ళెదుట ఉంచుకుని వూరికే పోనిస్తానా.....'
'చాల్లేరా పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్యవి బయలుదేరావు... నేనింక పెళ్ళి గురించి సీరియస్ గా ఆలోచించలేదులే-ఆలోచించినపుడు చెపుతాను'
'ముఫ్ఫై ఏళ్ళు వచ్చాయి. మంచి ఉద్యోగంలో వున్నావు. ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు' గోపాలకృష్ణ వత్తిడి తెస్తూ అన్నాడు.
దివాకర్ ఇబ్బందిగా కదిలాడు.
"ఏమోరా అమ్మ వాళ్ళు కూడా వూరికే ఫోటోలు అవి పంపి చంపుతున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కూడా చూపించారు. ఏది నచ్చక వదిలేశాను'
'పోనీ నీ రిక్వైర్ మెంట్స్ ఏమిటో చెప్పు?'
'అది సరేగాని ముందు నాకు ఓ సంగతి చెప్పు. నీ మిసెస్ కంటే జయంతి పెద్దది కదా, ఆవిడ పెళ్ళికాకుండా నీ పెళ్ళి ఎలా జరిగింది' అనుమానం వ్యక్తపరిచాడు.
'అదో కథలే...'
"ఏంటి చెప్పరా బాబు సస్పెన్సు చాల్లే' దివాకర్ చిరాగ్గా అన్నాడు.
'జయంతికి నేను నచ్చలేదు. దమయంతికి నచ్చాను.... సింపుల్' నవ్వాడు.
దివాకర్ అర్ధం కానట్టు చూశాడు.... 'అంటే....'