మనసున మనసై 11
మనసున మనసై 11 'ఏం లేదు బాగానే వుంది. రాత్రి ఏదో పార్టీకెళ్ళాను. పడుకోవడం ఆలస్యం అయింది.'దమయంతి అత్తవారి బంధువుల పెళ్ళికేనని దమయంతి చెప్పిందిలే' అంది. కాస్తాగి 'ఎవరితో వెళ్ళావు-దివాకర్ తోనా' అంది మళ్ళీ. జయంతి ఆశ్చర్యంగా చూసింది. 'దమయంతి చెప్పిందిలే. మీ బ్యాంకు మేనేజర్ దివాకర్ గోపాలకృష్ణ వాళ్ళంతా ఫ్రెండ్స్ అని. కిందటి మాటుకూడా అతనితో మీ ఉషారాణి పెళ్ళికి వెళ్ళానని అంది. జయంతి తల వూపింది. వాసంతి కాస్త తటపటాయిస్తూ 'ఆ... దివాకర్ మనవాడేటగదా, మనిషి ఎలాంటివాడు. గోపాలకృష్ణ ఏదో అన్నాడులే'
జయంతి కాస్త ముఖం చిట్లించి 'ఏమన్నాడు' అంది.
'ఆ... ఏదో, దివాకర్ కి మన జయంతికి సంబంధం బాగుంటుందన్నాడు. ఏదో మాటలలో చెల్లెలి ముఖంలో భావాలు గమనిస్తూ అంది. జయంతి ముఖం కాస్త ఎర్రబడింది సిగ్గుతో.
'నేను అతనితో మాట్లాడి చూడమని చెప్పాను. దమయంతి కూడా అంది. కుదిరితే బాగుండును అని అనుకున్నాం అందరం' వాసంతి మాటలు జయంతిలో ఆశలు రేపాయి. ఎవరన్నా తన తరపున అతనితో మాట్లాడితే తన పని సులువవుతుంది. గోపాలకృష్ణ స్నేహితుడు కనక చనువుగా అడగగలడు-కాని తను అంత అవమానించిన అతను ఈ పని భుజంమీద వేసుకుంటాడా....' చెల్లెలు ముఖంలో మారుతున్న భావాలు చూసి 'ఏమిటే ఆ ఆలోచన అతను బాగుంటాడు. మేనేజరు ఉద్యోగం, అన్నీ బాగున్నాయి. నీకేం అభ్యంతరం వుండదుగదా'
'బాగుంది. అన్నీ మనమే అనేసుకుంటే సరా అతని ఉద్దేశం ఏమిటో' కాస్త సిగ్గుపడుతూనే అంది. 'అతనేమంటాడో గోపాలకృష్ణ అడుగుతాడులే-ముందు నీ సంగతి చెప్పు' అంది కవ్విస్తూ. 'అబ్బ చూద్దాంలే. ఏదో అంతా అయిపోయినట్టు అంటున్నావు. అసలతను ఇప్పటినుంచే చేసుకుంటాడో, లేదో-అతని కోరికలేమిటో?' అర్దోక్తిలో ఆగి అంది. మనీషాలాంటి అందమైన అమ్మాయిలని చూసిన అతని కళ్ళకి తను ఆనుతుందా' అనిపించి కాస్త నిరాశ ఆవరించింది.
'చూద్దాం-ఎవరికెక్కడ రాసిపెట్టి వుందో' పిల్లాడిని పక్కమీద పడుకోబెట్టి అంది వాసంతి.
'అదిసరే, యింతకీ బాబుకి పేరేం సెలక్ట్ చేశారు బావగారు' అంటూ లేని ఉత్సాహం తెచ్చుకుని మాటమార్చింది.
'నాన్నపేరు, అమ్మపేరు అనకుండా మాడర్న్ పేరు పెట్టాలన్నాను. వాళ్ళవాళ్ళేం అనుకుంటారోనని ఆయన భయం- మంచిపేర్లు చెప్పు నాలుగైదు'
'రాసివుంచుతాలే ఆలోచించి-యింక వెళతానక్కా కాస్త