మనసా వాచా కర్మణా..1
telugu stories kathalu novels మనసా వాచా కర్మణా..1 అతన్ని ఇప్పుడు.. మా ఇంట్లో.. ఇలా.. చూస్తాననుకోలేదు నేను.
సాయంత్రం కాలేజీనుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎవరెవరివో కలగాపులగంగా మాటలు వినిపిస్తున్నాయి. 'ఎవరా' అన్న ఆసక్తితో లోపలికడుగుపెట్టాను.
నన్ను చూసి సంభ్రమంతో కేకలు పెట్టారు పిన్నీ, పెద్దమ్మల పిల్లలు. ఆ పక్కనే ఫొటో ఆల్బంని ముఖానికి అడ్డుపెట్టుకుని ఎవరో..! కళ్ళుమాత్రమే కనిపిస్తున్నాయి. అర్థమైపోయింది.
ఇంకెవరూ.. ఆ తేనెరంగు కళ్ళూ, ఒత్తైన కనుబొమ్మలూ, నల్లని గిరజాల జుట్టూ.. ఇంకా గుర్తుపట్టకపోతే నా జన్మ వేస్ట్.
అతన్ని పోల్చుకోగానే నా కళ్ళేకాదు పెదవులూ ఆనందంతో విచ్చుకున్నాయి. నేను గుర్తుపట్టేశానని అర్థమైనట్టు ఆల్బంని అడ్డుతీసేశాడు సంజయ్.
అతన్ని చూసి నా కళ్ళు మెరిశాయో, లేదూ నన్ను చూసి అతని కళ్ళే మెరిశాయో.. ఇద్దరిలోని ఆనందం మా ఇద్దరికి మాత్రమే తెలిసింది. సంజయ్‌ని చూసి సంవత్సరంపైనే అవుతున్నా ఎందుకో రోజూ చూస్తున్నంత దగ్గరగ అనిపించాడు.
నాకున్న ఒక్కగానొక్క అక్క శ్రీవల్లి పెళ్ళికి_ సంజయ్ వస్తాడని తెలుసుగానీ ఇంతముందే వచ్చేస్తాడని ఊహించలేదు. సాయంగా ఉంటారని మేనమామ కొడుకైన సంజయ్‌ని, అత్తయ్యని వెంట బెట్టుకొచ్చారట తాతయ్య.
సంజయ్ వచ్చిన క్షణంనుంచీ నేను మారిపోయాను. మనసు ఆనందంతో లోలోపల నవ్వేసుకుంటోంది. అక్కనీ, నన్నూ పక్కపక్కన పెట్టి పెళ్ళికూతురు ఎవరంటే నేననే అనేస్తారేమో చూసినవాళ్ళు. ఉదయం, సాయంత్రాలు మడతనలగని జిగేలుమనే బట్టలు, పసుపుపచ్చని చేతికి నిండుగ మ్యాచింగ్ గాజులూ, తలంటుతో అలిబిలిలాడే వెంట్రుకల్ని చుట్టుకుపోతూ మల్లెపూలూ, కారణంలేని కిలకిల నవ్వులూ,.. నాలో ఓ 'కొత్త నేను'..!
నాకోసం వెతికే సంజయ్ కళ్ళూ, నన్ను చూడగానే విరిసే మెరుపులాంటి నవ్వూ, నా సహచర్యంలో అతని తీరూ, అన్నీ అతని మనసుని నా ముందు పరిచాయి. కానీ.. అతనికంటే ఎక్కువగా అతనికోసం