ఇదీ కధ 9
ఇదీ కధ 9 "డాక్టర్ గారూ! మా తల్లి గారి కోరిక నెరవేర్చడానికి నేను సిద్దంగా ఉన్నాను." సాగర్ మంత్ర ముగ్దుడిలా డాక్టర్ ముందు నిలబడి అన్నాడు.
"వెల్! ఐ యామ్ గ్లాడ్! ఆ మాట మీ నాన్నగారితో చెప్పు. అయన ఆనందిస్తాడు" అంటూ డాక్టర్ సుభద్రమ్మ గదిలోకి దారి తీశాడు. అతడి వెనకే సాగర్ నడిచాడు. సుభద్రమ్మ మంచం మీద కళ్ళు అరమూతలు వేసి పడుకొని ఉన్నది. తల దగ్గర సాంబశివరావు కుర్చుని ఉన్నాడు.
"అమ్మా!" అంటూ సాగర్ తల్లి ముఖంలోకి వంగి చూశాడు.
"సాగర్! డోంట్ డిస్టర్బ్ హర్! ఇంతకూ ముందే మత్తు ఇంజక్షన్ ఇచ్చాను. ఆమెను నిద్రపోనీ" అన్నాడు డాక్టర్. సాంబశివరావుని చూసి "మీరు కూడా బయటకు రండి!" అన్నాడు. డాక్టర్ తో పాటు తండ్రీ కొడుకు లిద్దరూ గదిలో నుంచి బయటకీ వచ్చి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు.
"సాగర్ ఊ నీ నిర్ణయమేమిటో మీ నాన్నగారితో చెప్పు! ఇంకా ఆలస్యమెందుకు?" అన్నాడు డాక్టర్.
"మీ ఇష్ట ప్రకారమే కానియ్యండి! కానీ ......." సాగర్ నీళ్ళు నములుతున్నాడు .
"కానీ అంటున్నావ్? ఏమిటి సందేహం?" డాక్టర్ సాగర్ ను అడిగాడు.
"మాధవి ఆరోగ్యం బాగోలేదు , డాక్టర్! ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా?"
"మాధవి ఆరోగ్యానికి నీ పెళ్ళికి సంబంధం ఏమిటి?" సాంబశివరావు కొడుకు ముఖంలోకి సూటిగా చూస్తూ అన్నాడు.
"పెళ్ళంటూ చేసుకోవడం జరిగితే మాధవినే చేసుకుంటాను నేను మాధవిని ప్రేమిస్తున్నాను." ఖచ్చితంగా చెప్పాడు సాగర్.
డాక్టర్ నెత్తిన పిడుగు పడినట్టయింది! సాంబశివరావుకు కళ్ళెర్ర బడ్డాయి.
"నీ పెళ్ళి జరిగేది డాక్టర్ గారమ్మయి సుజాత తో - కానీ ఆ పిచ్చిదానితో కాదు!"
"నాన్నా!"
"మనం డాక్టర్ గారికి ఏంతో రుణపడి వుంటాం! మనతో సంబంధం కలుపుకోవడానికి అయన అంగీకరించారు. అది మన అదృష్టం. మా ఇద్దరి నిర్ణయం అయిపొయింది. మీ అమ్మ బ్రతికుండగానే యీ పెళ్ళి జరగాలి! వారం పదిరోజుల్లోపున