ఇదీ కధ 12
ఇదీ కధ 12 "సాగర్" మాధవి కళ్ళు అర్ధ్రమైనాయి.
"నువ్వు నువ్వు నిజంగా....."
"దేముడివి! అదేగా నీ డైలాగ్......ఇది మరీ పాత సినిమా డైలాగ్."
"సాగర్! అంతకంటే ఇంకేదయినా మంచిమాట ఉందంటావా?" ఆమె చెంపల మీద కన్నీటి బొట్లు రాలాయి.
"మనిద్దరం స్నేహితులం . ఒకరినొకరం అర్ధం చేసుకున్నా వాళ్ళం. పరస్పరం అభిమానించు కొంటున్నాం. ఒకళ్ళ కొకళ్ళం కావాలను కొంటున్నాం. కలిసి జీవించాలను కొంటున్నాం. కష్ట సుఖాల్లో భాగం పంచుకొంటున్న వాళ్ళం, అవసరం ఇద్దరిదీ. అనుబంధం ఇద్దరిదీ. అనందం ఇద్దరిదీ . సహచరులుగా జీవిత భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నాం...." సాగర్ ధోరణికి అడ్డొచ్చి,
"ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్న వాళ్ళం!" అన్నది మాధవి.
"అది మరీ పాత డైలాగోయ్!" సాగర్ పెదవుల మీద చిరునవ్వు తోనికింది.
"నాకు తెలుసు సాగర్! డైలాగ్ - అంటూ మాట మాటకీ ఎందుకు ఎత్తి పొడుస్తున్నావో! ఒకప్పుడు నీ ప్రతి మాటా తెలుగు సినిమా డైలాగ్ అని హేళన చేస్తూ ఉండేదాన్ని! అది మనసులో పెట్టుకుని అంటున్నావు కదూ?"
సాగర్ కొంటెగా చూస్తూ హాయిగా నవ్వుకున్నాడు.
"పాత తెలుగు సినిమా అయినా కొత్త తెలుగు సినిమా అయినా కొన్ని భావాలను, అనుభూతులను ప్రత్యేక మైన సందర్భాలలో ప్రకటించాలంటే ఆ డైలాగ్ లకు మించిన మాటలు లేవేమో ననిపిస్తుంది సాగర్ - కాకపోతే ప్రేమించాను అని చెప్పడానికి పౌరాణిక డ్రామాల్లోని కొండవీటి చాంతాడంత సంభాషణ మొదలు పెట్టావా లేదా? నువ్వే చెప్పు సాగర్!"
'ఇంతకీ నన్నేమని చెప్పమంటావూ?"
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను! అని"
"నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానా?"
"మనసారా గినసారా - ఇవన్నీ సూపర్ ఫ్లుయస్ సింపుల్ గా క్లుప్తంగా అంటే చాలు. దానికి మించినది లేదు తెలిసిందా మిస్టర్?" అన్నది మాధవి.
"తెలిసింది మిస్" అన్నాడు సాగర్.
వినీల ఆకాశంలో ధనస్సులా వంగిన రంగులు కరిగి పోయాయి. కారుమేఘాలు కమ్ముకు రాసాగాయి. తళుక్కున మెరుపు! దూరంగా మేఘ గర్జన! టపటప మని చినుకులు పడసాగాయి.
"మాధవీ! లే! వాన ముంచుకొస్తుంది"