ఇదీ కధ 11
ఇదీ కధ 11
"అదే గదా నేను చెప్పడం! మాధవిని చూడు ! ఎంత ముచ్చటగా ఉన్నదో! ఇలాంటి పిల్లల మీదనా మీ పరిశోధనలూ! ఇవన్నీ నిజంగా మతి ఉన్న వాళ్ళు చేయాల్సిన పనులేనా?" ముక్కుమీద గుద్ది నట్టయింది ప్రొఫెసర్ కు.
చంద్ర శేఖరం నిస్సహాయంగా సాగర్ ను చూశాడు.
'అది సరే! అమ్మాయ్! మీ అయన కేమొచ్చింది? ఏమన్నా గొడవలుంటే మీరూ మీరూ సర్దుకోవాలి గాని ఈయన దగ్గర పరీక్ష లేమిటి?' సాగర్ వైపు తిరిగి అన్నది కళ్యాణి. సాగర్ కు ఏం చేయాలో , తోచక ప్రొఫెసర్ వైపు చూశాడు. ప్రొఫెసర్ ఇంటి కప్పు కేసి చూశాడు.
"అయన నా స్నేహితుడు , సాగర్, ఫామిలీ ఫ్రెండ్" మాధవి కళ్యాణికి చెప్పింది.
'ఓహో! అలాగ! నీ భర్తేమో అనుకున్నా! ఆ మీ నాన్నగారి పేరేమిటమ్మా!"
"రామనాధం గారూ!' మాధవి చెప్పింది.
"జడ్జి రామనాధం గారు!" మాట్లాడడానికి అవకాశం దొరికింది ప్రొఫెసర్ కు. "ఎట్లా ఎట్లా జడ్జి రామనాధం గారి అమ్మయివా? రా అమ్మా లోపలికి. కాఫీ తీసుకొందువు గాని." అంటూ కళ్యాణి మాధవిని గదిలో నుంచి తీసుకెళ్ళింది.
"సాగర్! పెద్ద గండం గడిచిందయ్యా!" ప్రొఫెసర్ పెద్దగా నిట్టూర్చి కుర్చీలో కూలబడ్డాడు.
"ఆమె కేమన్నా?" సాగర్ ఎదురుగా వచ్చి కూర్చొని తలను చూపుడు వేలుతో చూపిస్తూ అడిగాడు.
"లూజ్ ఏమీ కాదు." ప్రొఫెసర్ సాగదీసాడు.
"మరి అలా ప్రవర్తించిందేమి?"
"కల్యాణిది ప్రత్యేకమైన మనస్తత్వం. సైక్రియాటిస్ట్ తో పాతిక సంవత్సరాలు సంసారం చేసిన ఫలితం అది! మతి తప్పినా వాళ్ళకు నేను డాక్టర్ని, ఆ టెస్టులు ఈ టెస్టులూ చేసి, యంత్రాలన్నీ వాళ్ళ తలకు తగిలించి వున్న మతి పోగోడ్తున్నాని ఆమె అభిప్రాయం. ఆమె అభిప్రాయం మార్చడానికి నేను చాలా ప్రయత్నించాను . తనకు మతి పోగోడ్తున్నానని నా మీద అభియోగం?"
"ప్రొఫెసర్! ఆమెగారు ఇలా ఇన్ వెస్ట్ గేషన్ లాబ్ లో కొచ్చి పేషెంట్స్ ముందు ఇలా మాట్లాడితే చాలా ప్రమాదం కదా?"
"ఆ మాట నిజమేనోయ్! మొదట్లో ఇలా చేసేది కాదు. రాను రాను ఇలా నేరుగా లాబ్ లోకి రావడం నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టింది. ఈ పూట గుడికి వెళ్ళింది కదా ఇప్పట్లో రాదని డోర్ లాక్ చేయలేదు."
"మాధవి మీద మీరు చేసిన టెస్టు పూర్తిగా కాలేదు. మీ ప్రయత్నం అంతా వృధా అయినట్టే కదా?"
"అలా ఎందుకు అనుకోవాలి? లేట్ మీ స్టడీ ది గ్రాప్స్ , టేప్స్ అండ్ రిపోర్ట్.నేను బెంగుళూరు వెళ్ళి వచ్చాక అవసరమనుకుంటే మరోసారి టెస్ట్ చేస్తాను."
ఓ.కే సార్" సాగర్ లేచాడు.
"మాధవిని పిలిపించండి. వెళ్తాం!' అన్నాడు సాగర్.
ప్రొఫెసర్ చంద్ర శేఖరం లేచి లోపలికి వెళ్ళాడు. మరో ఐదు నిముషాల్లో ప్రోఫేసరూ, కళ్యాణి మాధవిని వెంటబెట్టుకొని వరండాలోకి వచ్చారు.
"థాంక్యు ప్రొఫెసర్! బై! బై! అంటీ.!"