ఇసుక పూలు 1
telugu stories kathalu novels ఇసుక పూలు 1 "ఏరా అయ్యప్పా..! ఎప్పుడొచ్చావురా..?" నోట్లోని చుట్టని ఈ వైపునుంచి ఆ వైపుకి మార్చుకుంటూ అడిగాడు వరసకి తాతయ్య అయ్యే సోమినాయుడు తాత.
"రాత్రే వచ్చా. కాలేజ్లో ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. దానికోసం.." తాతముఖం చూశాక తెలిసింది.. ఆయనకి నేను చెప్పేది అర్థంకాలేదని. అందుకే వివరంగా చెప్పాను. "అదే.. సంవత్సరానికోసారి పరీక్షలొస్తాయి కదా. వచ్చేనెల్లోనే ఆ పరీక్షలు. వాటికోసం ఇంట్లో కూర్చొని చదువుకోమని కాలేజీకి సెలవులిస్తార్లే.. ఆ సెలవులిప్పుడు.." అన్నాను.
"ఆహా అలాగా..! సరే మరి. మీ పిల్లకాయలైనా బా చదవండ్రా. మాలాగ ఎన్నాళ్ళు ఈ ఇసకలో బతుకుల్ని ఇంకించుకుని బతుకుతారు.." అంటూ, భుజంమీదున్న చెక్క దిమిశాని బ్యాలెన్స్డ్గ ఉంచి, పంచెని పైకి మడిచి కట్టుకున్నాడు తాతయ్య.
'అలాగే'నన్నట్టు తలూపాను.
వెళ్తున్న తాతయ్య భుజంమీదున్న దిమిశ బలరాముడి చేతిలోని నాగలిలాఉంది. అటూఇటుగా డెబ్భైఏళ్ళు దగ్గరకొస్తున్నా ఇప్పటికీ వస్తాదులా ఉంటాడు తాతయ్య.
మా చుట్టరికాలందర్లోకీ కాస్తోకూస్తో డబ్బూ పరపతి ఉన్నవాళ్ళెవరంటే సోమి నాయుడు తాతే. అందుకే ఆయన వయసుకీ, మాటకీ ఈ పేటవాళ్ళంతా విలువిస్తారు.
నేను మెకానికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నానంటే దానికి మూలకారణం సోమితాతే.
'ఇసక తొక్కుకుంటూ మసిబారిన బతుకులు పిల్లలకొద్దు. కనీసం బాగా చదివే పిల్లల్నన్నా మంచి చదువులు చదివిద్దాం. వాళ్ళైనా సుఖపడతారు..' అంటూ, మా నాన్నకి చదివించే స్తోమత లేకపోయినా పదోతరగతిలో మండలం ఫస్టొచ్చిన నన్ను కాలేజీలో చేర్పించాడు. నా ఆసక్తి తెలుసుకుని, ఇంజనీరింగ్ చదవమని ప్రోత్సహించడమే కాకుండా నాలుగేళ్ళనుంచీ కాలేజీ ఫీజులకి తాతే