అర్దరాత్రి ఆడపడుచులు 5
telugu stories అర్దరాత్రి ఆడపడుచులు 5 "రండి!" అని భర్త చెయ్యి పట్టుకుని, పొరలి వస్తున్న దుఃఖం బయటపడకుండా పెదిమలు కొరికిపట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది జానకి. పక్కదులిపివేసి "పడుకోండి" అంది మృదువుగా.
నిస్సత్తువగా పక్కమీదికి ఒరిగిపోయాడు రమణమూర్తి.
జానకి కూడా పడుకుని, కప్పువైపు చూస్తూ ఆలోచించడం మొదలెట్టింది.
ఒకగంట తర్వాత చటుక్కున లేచి కూర్చున్నాడు రమణమూర్తి. బయటముసురుగా వానపడుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అందుకే వాన.....పిల్లలవైపు చూశాడు రమణమూర్తి ముడుచుకుని పడుకుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి జానకి కప్పిన రగ్గు చెదిరిపోయి ఉంది. రగ్గుసరిగ్గా కప్పాడు రమణమూర్తి తర్వాత ఇంకో రగ్గు తీసుకుని, తలుపు గడియ తీసాడు. ఆకొద్ది అలికిడికే కదిలింది జానకి, అయిదు నిమిషాల క్రితమే పట్టినమగత నిద్ర తెరలోనుంచి కొద్దిగా బయటికివస్తూ "ఎక్కడికి" అంది.
"చలెక్కువగా ఉంది జానీ! సృజనకి రగ్గు కప్పివస్తా!"
"ఊ!" అంది జానకి మళ్ళీ మగతలోకి జారిపోతూ.
కానీ, అతను అన్న మాటకి అర్ధం కొద్దిసేపటితర్వాత మనసు కెక్కాక, ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని తల విదిలించింది.
"ఏమండీ!" అంది ఆదుర్దాగా.
సమాధానం చెప్పడానికి రమణమూర్తి అక్కడలేడు!
తొట్రుబడుతూ బయటికి వచ్చి చూసింది జానకి.
హాలు తలుపు తెరచిఉంది. గేటూ బార్లా తెరిచే ఉంది.
చెప్పులు ఉంచేచోట చూసింది జానకి. రమణమూర్తి చెప్పులు అక్కడే ఉన్నాయి. బూట్లుకూడా ఉన్నాయి.
రమణమూర్తి ఎక్కడా లేడు!
సృజనకి రగ్గు కప్పివస్తానని చెప్పిన రమణమూర్తి చెప్పులైనా వేసుకోకుండా వెళ్ళిపోయాడు!
ఆతర్వాత అందరూ కలసివెదకడం మొదలైంది.
ఈసారి రమణమూర్తి కోసం!
వాన ఉధృతమైంది.
ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు రాఘవులు. అతని మెదడు దెయ్యాలు నడుపుతున్న కార్ఖానాలా ఉంది. ఒకదాన్ని మించిన భయంకరమైన ఆలోచన మరొకటిగా అతని మెదడులో రూపు దిద్దుకుంటోంది. ఆ కార్ఖానా