అర్దరాత్రి ఆడపడుచులు 2

By | November 23, 2019

అర్దరాత్రి ఆడపడుచులు 2 గేటు చప్పుడైంది.
అందరూ తలలు తిప్పి చూశారు. సృజన రాలేదు కానీ రమణమూర్తి వాళ్ళ ఆఫీస్ ఫ్యూన్ యూసఫ్ వచ్చాడు. అతని చేతిలో చిన్న పంజరం ఉందని అందులో ఉంది ఒక అందమైన మైనా పిట్ట.
ఆమైనా పిట్టను కొనుక్కురమ్మని పొద్దున ఆఫీసుకి వెళ్ళగానే యూసఫ్ కి చెప్పాడు రమణమూర్తి.
“సృజన బేటీ ఏది సాబ్? ఆమె కోసం ఓల్డ్ సిటీ అంతా తిరిగి తెచ్చినా ఈ మైనాని!” అన్నాడు యూసఫ్.
“సృజన మా ఇంటికి వెళ్ళిందేమో!” అన్నాడు రమణమూర్తి తమ్ముడు.
“చూసిరా!” అంది జానకి సంజయ్ తో.
సంజయ్ రివ్వున పరిగెత్తి వెళ్ళాడు.
“నేనొకసారి స్కూలు దాకా వెళ్ళి చూసొస్తాను. అక్కడ బస్టాండులోనే ఉండిపోయిందేమో!” అంటూ స్కూటర్ ఎక్కాడు రమణమూర్తి.
సృజన బస్టాండ్ లోలేదు. స్కూల్లో లేదు. రమణమూర్తి తమ్ముడి ఇంటికి కూడా రాలేదని తెలిసింది.
మరి ఎక్కడికి వెళ్ళింది?
అందరూ కలిసి ఆ వీధిలో అందరి ఇళ్ళూ వెదకడం మొదలెట్టారు. తర్వాత బంధువుల ఇళ్ళకి పరిగెత్తారు. ఫోన్లు చేశారు.
గంటలు గడిచిపోతున్నాయ్. సృజన రాలేదు.
బర్త్ డే పార్టీకి వచ్చి, జరుగుతున్న గందరగోళమంత బెదురుగా చూస్తున్న సృజన క్లాస్ మేట్స్ లేచి నిలబడ్డారు. ప్రెజెంటేషన్స్ అక్కడే పెట్టేసి “ఇంకా ఇంటికి వెళతాం ఆంటీ! ఇంకా లేటైతే ఇంట్లో తిడతారు. అప్పుడే ఏడయిపోయింది.” అన్నారు నెమ్మదిగా.
అప్పుడు సన్నగా ఏడవడం మొదలెట్టింది జానకి. నిజమే! ఆ టైం దాటి చిన్నపిల్లలు అందులోనూ ఆడపిల్లలు బయట తిరుగుతూ ఉండడం జరగదు. సృజనకూడా ఇంత పొద్దుపోయే దాకా ఇంటికి రాకుండా ఎప్పుడూ ఉండలేదు.
ఇవాళ నిశ్చయంగా ఏదో జరిగింది!
కానీ ఆ జరిగింది ఏమిటి? ఊహించుకోడానికే భయంగా ఉంది.
రమణ మూర్తి టెన్షన్ భరించలేక సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు.
బర్త్ డే పార్టీకి వచ్చిన బంధువుల్లో ఒకాయన అన్నాడు “పోలీసు రిపోర్టు కూడా ఇవ్వడం నయం! మనంతట మనం ఎన్నిచోట్లని వెదకగలం? అవునా?”
“సరే!పదండి!”అన్నాడు రమణమూర్తి ఆ క్షణంలో ఆహాడు ఎవరు ఏం చెప్పినా చేసేటట్లు ఉన్నాడు. స్వయంగా నిర్ణయాలు చేసే వివేకం కోల్పోయింది అతని మనసు.
వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ వైపు నడిస్తే వాళ్ళ వెనకే పరిగెత్తాడు సంజయ్.
420 సెక్షన్ కింద ఎవరో ఇచ్చిన చీటింగ్ కంప్లయింట్ గురించి విచారిస్తున్నాడు ఇన్స్ పెక్టర్. చాలా బిజీగా ఉన్నాడు అతను. అనుక్షణం మోసగాళ్ళతో, దొంగలతో, సంఘ వ్యతిరేక శక్తులతో మెలగవలసి రావడంవల్ల అతని మాటా, మనసూ కూడా బండబారిపోయాయి.
తన ఎదుట ప్రవేశ పెట్టబడిన మూర్తివాళ్ళ వైపు ఒక్కక్షణం చూసి తర్వాత చీటింగ్ కేసులో ఇరుక్కున్న టీషర్టు శాల్తీ వైపు తిరిగాడు ఇన్స్ పెక్టర్.
“అయితే అప్పుడేమైంది?”
ఉన్నట్లుండి కంపించడం మొదలెట్టాడు టీషర్టు వేసుకున్న అతను “సార్! నాకేం తెలీదు సార్! నేను ఇటువంటి దందాలు ఎప్పుడూ…”
“నోర్ముయ్ నీయమ్మ దొంగబాడఖోవ్!” అన్నాడు ఇన్స్ పెక్టర్ హఠాత్తుగా రంకెలేస్తూ, “నీ పులుసుదించుతా తెరీ…..(బూతులు) రేయ్ ఖాదర్! ఈ లడ్డుకొడుకుని బొక్కలో తొక్కు.”
“సార్! నేను….”
“నోరెత్తావంటే మక్కెలిరగదంతా మాక్కే….”
షాక్ లో ఉన్న అతన్ని లాక్కునివెళ్ళిపోయాడు కానిస్టేబుల్.
“ఇంక నీ గొడవ ఏమిటి” అన్నాడు రమణమూర్తి వైపు తిరిగాడు ఇన్స్ పెక్టర్ వాళ్ళని కూర్చోమని కూడా అనలేదు. అనేంత వ్యవధికూడా లేదు అతనికి. రాజాస్థానం లోకి ప్రవేశపెట్టబడుతున్నట్లుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు ఫిర్యాదీలూ, ముద్దాయిలూ, వాళ్ళ కంప్లయింట్లూ, కేసులూ…
“మా అమ్మాయి ఇంటికి తిరిగిరాలేదండీ!” అన్నాడు మూర్తి వణుకుతున్న గొంతుతో.
“లేచిపోయిందా?” అన్నాడు ఇన్స్ పెక్టర్ చాలా మామూలుగా.
ఆగ్రహంతో ఊగిపోయాడు మూర్తి నోటి వెంబడిమాట రాలేదు అతనికి. అతనితో వచ్చి బంధువు సర్ది చెబుతున్నట్లు అన్నాడు “పసిపిల్ల అండీ! పదమూడేళ్ళే! స్కూలుకెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు.”
“పదమూడేళ్ళేపిల్ల పసిపిల్ల ఎలా అవుతుందయ్యా! షీ ఈజ్ ఏ టీనేజర్! ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికెళ్ళిందేమో! కనుక్కోండి!”
“ఫ్రెండ్స్ అమ్మాయి కోసం మా ఇంటికొచ్చారండీ! ఇవాళ మా అమ్మాయి బర్త్ డే!”
విసుగుని అణుచుకుంటూ చూశాడు ఇన్స్ పెక్టర్. “బర్త్ డే కదా! షాపింగు కి వెళ్ళిందేమో! ఇంకోసారి వెదికి ఇంకో గంటతర్వాత రండి చూద్దాం.”
“సార్! టైం గడిచినకొద్దీ….” ఉన్నట్లుండి సహనం కోల్పోయినట్లు పెద్దగా అరిచాడు…
“అయితే ఏంటంటావ్? ఇప్పటికిప్పుడే కేసు బుక్ చేసుకోనా? ఒకసారి రాసుకున్నానంటే ఇగపొద్దునా మధ్యాహ్నం సాయంత్రం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక చస్తారు! ఎరికేనా?”
“రాత్రింబగళ్ళు తిరగమన్నా తిరుగుతాం సార్! మా అమ్మాయి మా ఇంటికొస్తే చాలు!” అన్నాడు రమణమూర్తి దీనంగా కొద్దిక్షణాలక్రితం అతని మొహంలోకనబడ్డా ఆగ్రహంజారిపోయి అధైర్యం కనబడుతోంది ఇప్పుడు.
“మీ……ఖర్మ!” అని సాగదీస్తూ విసుక్కుని “రిజిస్టర్ తేరా!” అని కానిస్టేబుల్ ని కసిరాడు ఇన్స్ పెక్టర్.
“అతి కంగారుతో అందరినీ అదరగొట్టేస్తారు మీలాంటివాళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారుగానీ ఇంతాచేసి ఇంటికి వెళితే మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంటుంది నాకు తెలుసు! చెప్పండి”
రమణమూర్తి బంధువు వివరాలు చెబుతూ ఉంటే ఇన్స్ పెక్టర్ కేసు రిజిస్టర్ చేసుకోవడం పూర్తయింది.
“మీరు వెంటనే వెదికించడం మొదలెడతారా సార్?” అన్నాడు రమణమూర్తి ఆదుర్దాగా.
“మీకెందుకు! మీరు ఇంటికెళ్ళండి! మీరెళ్ళేసరికి మీ అమ్మయ్ మీ ఇంట్లో ఉంటుంది” అంటూనే నవ్వుమొహంపెట్టి లేచినిలబడ్డాడు ఇన్స్ పెక్టర్. “హలోరావు సాబ్! రండి! రండి! దర్శనాల్లేవు! మీరే వచ్చారేమీ? ఫోన్ చేసి చెబితేచాలదా?”
ఇంకా తాము అక్కడ ఉండి చేసేదేమీలేదని గ్రహించిబయటికి వచ్చేశారు మూర్తీవాళ్ళు. ఇన్స్ పెక్టర్ మాట వాళ్ళకు గురికుదరలేదు.
ఇల్లు చేరారు.
కానీ ఇంట్లో సృజన లేదు.
అప్పటికే రేడియోలో ఇంగ్లీషు న్యూస్ వస్తోంది.
అంటే రాత్రి తొమ్మిది దాటిందన్నమాట! రాత్రి తొమ్మిదిదాటినా, పొద్దున స్కూలుకి వెళ్ళినపదమూడేళ్ళ కూతురు ఇంకా ఇంటికి రాలేదు!
అప్పటిదాకా సన్నగా ఏడుస్తున్న జానకి, తిరిగి వచ్చిన రమణమూర్తి మొహం చూడగానే రోదించడం మొదలెట్టింది.

అక్కడే పంజరంలో ఉన్న మైనాపిట్ట, తాను కోల్పోయిన స్వేచ్చని తలుచుకుని దుఃఖిస్తున్నట్లు విషాదంగా అరవడం మొదలెట్టింది.
వ్వవ్వవ్వ
పంజరం కంటే పెద్దదేమీకాదు ఆ గది. చీకటిగా ఉంది. చాల రోజులనుంచి తలుపులు మూసి ఉంచినట్లు అదొక రకమైన వాసనవస్తోంది. కప్పుకి బదులుగా ఉన్న రేకు మీద వాన చినుకులు పడుతూ ఉంటే టప్పు టప్పు మనే ఆ శబ్దం లౌడ్ స్పీకర్ వినిపించినట్లు పెద్దగా వినబడుతోంది. వాన నీరు మట్టి గోడలలోకి ఇంకి, గదినంతా చెమ్మగా చేస్తోంది.
చెప్పలేనంత దిగులుగా ఉంది అక్కడివాతావరణం.
ఒకపాత ఇనప మంచంమీద పడుకుని ఉంది సృజన కాదు, పడుకున్న భంగిమలో మంచానికి కట్టివేయబడి ఉంది ఆమె.
కేకలువేసి వేసి ఆమె గొంతుతడారిపోయినా, ఒక్క కేకా బయట ఉన్నవాళ్ళెవరికీ వినబడలేదు. ఆమె నోట్లో ఒక మురికి బనీను కుక్కి ఉంది.
ఉండిఉండి వెక్కుతోంది సృజన. కన్నీళ్ళతో ఆమెబుగ్గల మీద చారికలుకట్టి ఉన్నాయి.
ఎక్కడ ఉంది తను? తనని ఎత్తుకు వచ్చింది ఎవరు? ఎందుకు ఎత్తుకొచ్చాడు?
మళ్ళీ ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది సృజనకి.
చాలాసేపటి తర్వాత దుఃఖాన్ని ఉగ్గబట్టుకుని, జరిగినదంతా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది సృజన.
స్కూలువదలగానే బయటికివచ్చింది తను. జైహింద్ స్టోర్స్ పక్కనున్న సందులో నుంచి తిరిగిరావడం తనకి అలవాటు. ఆ సందు కొంచెం లోన్లీగా ఉంటుంది. అయినా అలవాటైనసందు కాబట్టి తను ఎప్పుడూ భయపడలేదు.
రోజూలాగానే ఇవాళకూడా తను సందుమలుపు తిరిగింది. అటో ఒకటి అక్కడ ఆగి ఉండడం గమనించింది తను. తను గమనించనిదల్లా, ఒక మనిషి పిల్లిలా తనను వెనకనుంచి సమీపిస్తున్నాడనే!
అతను తనని మొరటుగా ఆటోలోకి తోశాడు. మరుక్షణం లో తన నోట్లో గుడ్డలుకుక్కారు ఎవరో. అటూ ఇటూ కదలడానికి వీల్లేకుండా బలంగా పట్టేసుకున్నాడు ఒక మనిషి.
దిగ్భ్రమచెంది ఉండిపోయింది తను.
అప్పుడు, అనుకోకుండా, నాన్నగారి స్కూటర్ ఆటోకి డాష్ కొట్టేంత దగ్గరగా వచ్చింది. కానీ నాన్నగారు తనని చూడలేదు. సైకిల్ మీద వెళుతున్న ఇంకో చిన్న అమ్మాయిని చూస్తున్నారు.
ఆయన్ని చూడగానే తను గొంతు చించుకు వేసిన కేక గొంతు దాటి బయటికిరాలేదు.
స్కూటర్ గనక డాష్ కొట్టి ఉంటే ఆటో ఆగి ఉండేది. జనం పోగయ్యేవారు. తను రక్షింపబడేదేమో కూడా!
కానీ నాన్నగారు….
ఆ ఆలోచన వచ్చినందుకే తనని తాను శపించుకుంది సృజన.
అప్పుడు మొదలయింది సృజన కోసం పోలీసు సెర్చ్!
సృజన ఆచూకీ మాత్రం తెలియలేదు.
దానికి కారణం ఉంది.
సృజనని అపహరించిన రాఘవులూ, జాన్, ఇద్దరూ కూడా కొత్తగా క్రిమినల్ లైఫ్ లోకి అడుగుపెట్టినవాళ్ళు ఇంకా పోలీస్ రికార్డులలలోకి ఎక్కలేదు వాళ్ళపేర్లు.
అందుకనేవాళ్ళని వెంటనే ట్రేస్ చెయ్యలేకపోయారు పోలీసులు.
శోకాలతోనే ఆ రాత్రి అంతా గడిచిపోయింది. తెలతెలవారుతుండగా ఒక ముసలావిడ సలహా ఇచ్చింది జానకికి” పోలీసుల చుట్టూ తిరిగితే పసవుతుందిలే జానకమ్మా! పోలేరమ్మ గుడిదగ్గర తాయెత్తుల మల్లయ్య ఉంటాడు. అతన్ని అడిగితే అమ్మాయి ఎక్కడుందో అంజనం వేసి అరక్షణంలో చెబుతాడు! ఊరికే అక్కడికీ ఇక్కడికీ తిరిగి అవస్తపడబాకండి! మల్లయ్యని మించిన మొనగాడెవరున్నారే! మొన్న రాధాకృష్ణయ్యగారి గేదె తప్పిపోతే…..”
ఆవిడ మాటలు పూర్తికాకుండానే లేచి నిలబడింది జానకి.
“పదమామ్మా! వెళ్ళొద్దాం!”
ఇద్దరూ కలసి తాయెత్తులమల్లయ్య దగ్గరికివెళ్ళారు.
“నీ కూతురు ఊరికి దక్షిణంలో ఉంది! నీ కూతురు నీ ఇంటికాడికి తిరిగొచ్చేటట్లు చెయ్యాలంటే మూడొందలవుద్ది. గట్టిగా పూజలు చేయించాలి. నీ కూతుర్ని వెనక్కి రానివ్వకుండా ఒక శక్తి అడ్డం పడతా ఉంది. దాన్ని లొంగదియ్యాలంటే కోడి పుంజులు గావాల, నిమ్మకాయ గావాల, యాపమండలు గావాల…..ఇవన్నీ నే జూసుకుంటా! నువ్వు పైకం తెచ్చివ్వు!” అన్నాడు మల్లయ్య.
మామూలు పరిస్థితులలో అయితే మల్లయ్య లాంటివాళ్ళ దరిదాపులకి వచ్చేదికాదు జానకి.
కానీ ఈ క్షణంలో ఆమెకి అలాంటిపట్టింపులేమీ లేవు. తన కూతురు తనకి దక్కాలి! అంతే! మరుమాట్లాడకుండా మూడొందలు తీసి మల్లయ్యకిచ్చింది జానకి. ప్రాధేయపూర్వకంగా అతనికి చేతులు జోడించి నమస్కారం పెట్టింది.
అక్కడ నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళారు. ఆకుపూజ చేయించింది జానకి.
ఇంటికి తిరిగివచ్చీరాగానే కప్ బోర్డు తెరిచింది. నగల పెట్టె తీసిదానిలో ఉన్న నగలన్నీ ఒక పసుపుగుడ్డలో వేసింది. కంపిస్తున్న చేతిలో తన చెవులకి ఉన్న కమ్మలూ, ముక్కుకి ఉన్న ముక్కుపుడకా, చేతుల గాజులూ, వేలుకి ఉన్న ఉంగరం, మెడలోని గొలుసూ, అన్నీ తీసేసి ఆ గుడ్డలోవేసి మూట కట్టింది.
ఆనగలన్నీ నిలువుదోపిడీలాగా తీసి మూటగట్టింది జానకి. తన ఇష్ట దైవం వెంకటేశ్వరస్వామిని తలుచుకుంది, “మా అమ్మాయిని మాకువప్పగించెయ్ స్వామీ! ఈ నగలేకాదు, ఇన్ని నగలు మళ్ళీకొని, మళ్ళీ నీకు నిలువుదోపిడీ ఇస్తాను.” అనుకుంది ఆవేదనతో.
“మనం ఏం పాపం చేశాం జానకీ?” అన్నాడు అతను కలవరిస్తున్నట్లు” నాకు గుర్తున్నంతవరకూ మనం ఎవరికీ ఏ అపకారం చెయ్యలేదే! చేతనయినయితే మేలుచేశాం, చేతకాకపోతే చేతులు ముడుచుకు కూర్చున్నాంగానీ ఎవరికీ ఎప్పుడూకూడా….” అతని గొంతు రుద్దమయింది.
“జానీ! మన కెందుకింతశిక్ష పడింది.”
జవాబు చెప్పకుండా, నిర్నిమేషంగా కప్ బోర్డులోకే చూస్తోంది జానకి.
వినబడింది ఒక శబ్దం,
ఆబట్టల అడుగునుంచి….
ఒక చిన్నపిల్ల ఏడుస్తున్నట్లు…..
ఉలిక్కిపడి, బట్టలను చిందర వందరగా పక్కకు తోసేసింది జానకి. ఆమె మొహంలో ఆశ కనబడుతోంది.
మరుక్షణంలో ఆ ఆశ అంతా నిరాశగా మారింది.
బట్టలక్రింద ఉంది, సృజన చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మ. అందమైన మొహం బంగారు జుట్టు నీలికళ్ళూ, గళ్ళఫ్రాకూ, నిలబడితే నవ్వుతుంది. నొక్కితే ఏడుస్తుంది.
ఆబొమ్మ పక్కన లేకుండా నిద్ర పోయేదికాదు సృజన. దాన్ని ఒళ్ళోకూర్చోబెట్టుకుని ఎప్పుడూ ఒక పాటపాడుతూ ఉండేది. ముద్దుపలుకులతో “చిన్న చిన్న బొమ్మ ఇదిగో చిత్రమైన బొమ్మా, అమ్మనాకుకొని ఇచ్చిన అందమైన బొమ్మ.”
కాస్త పెద్దయ్యాక ఇప్పుడు కూడా, ఆ బొమ్మను భద్రంగా తన బట్టల మధ్య దాచి ఉంచింది. రోజుకొక్క సారన్నా దాన్ని చూడకపోతే తోచదుసృజనకి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *