జీవన మాయ 1
telugu stories kathalu novels జీవన మాయ 1 సూర్యుడు కోపంతో అరుణరూపం దాల్చినట్టు తెల్లని ఎండ ఎర్రటి వెలుగుగా మారుతోంది. ఎటు చూసినా నిర్మానుష్యం, నిశ్శబ్దం. మధ్యాహ్నాన్ని దాటి సాయంత్రాన్ని సమీపిస్తోంది సమయం.
వెయ్యి గడపకూడా లేని ఆ పల్లెటూరుకి చివరన, పొలాలకి ముందూ ఉన్న స్మశానం అది.
ఆ స్మశానంలో ఓ మూల పడేసున్న చెట్టుమొద్దుమీద కూర్చున్నారు కాటికాపరి చలమయ్య, అతని కూతురు శాంత. ఆమె స్మశానానికి రావడం అదే మొదటిసారి. అందుకే చుట్టూ పరిశీలనగా చూస్తోంది.
దూరంగా రోడ్డు చివర్నుంచి వారు ఎదురుచూస్తున్న డప్పులచప్పుడు లీలగా వినిపించడం మొదలైంది. దుంగమీంచి లేచాడు చలమయ్య. ఆయన్నే గమనిస్తున్న శాంత కూడా లేచి నుంచుంది. అవునాకాదా అని ధృవపరుచుకోవడానికి మరోసారి ఎర్రమట్టిరోడ్డు మలుపు చివరకి చూశాడు చలమయ్య. మట్టి రోడ్డు దాటి స్మశానంరోడ్డులోకొస్తోంది ఊరేగింపు గుంపు. ఒక్కసారిగా ఊపందుకుంది డప్పుల చప్పుడు.
అప్పుడప్పుడు వినేదే అయినా ఆ శబ్ధానికి శాంతఒళ్ళు గగుర్పొడిచింది. అలాగని శాంత చిన్నపిల్లేం కాదు. మూడుపదులు నిండిన ప్రౌఢ. ఇద్దరు ఆడపిల్లలకి తల్లి. డప్పుల శబ్దం దగ్గరవుతున్న కొద్దీ గుండెల్లో ఏదో తెలీని దడగా అనిపించిందామెకి.
పాడెని మోసుకొస్తున్న జనాల్ని చూసి, అవన్నీ అలవాటైన