శృంగార నగరం 25
అప్పటికి అతను ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఆమె కొనసాగించింది. "నా మాటలవల్ల చేతలవల్ల నీలో ఈ మార్పు ప్రారంభమైందని వినూత్నను నువ్వు తాకనప్పుడే అర్ధమైంది. నీ ప్రేమను స్వీకరించాలన్న కోరిక కూడా అప్పుడే ప్రారంభమయింది నాలో"
అతను చివుక్కున తలెత్తాడు.
"వయసొచ్చినప్పుట్నుంచీ ఆడపిల్లలతో గడిపే ఆచారాన్ని కొనసాగించిన నువ్వు ఓ ఆడపిల్లమీద మనసు పడటం నీ ప్రేమతత్వాన్ని చెబుతుంది. ఆమె కోసం ఆ ఆచారాన్ని సైతం ఒదులుకోవడానికి సిద్దపడడం ఆమెపట్ల ఎంత ఆరాధన వుందో తెలియజేస్తుంది. ఆమె నేను కావడం అదృష్టంగానే అనుకోమంటావా?" చివరికొచ్చేసరికి కొంటెగా అడిగింది.
వర్ష మనసు తెలిసిపోవడంతో సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి దగ్గరలో ఆధారం దొరికినట్లయింది. అతని ఆనందానికి అవధుల్లేవు. జీవితంలో తొలిసారిగా అతను అలాంటి స్థితిని అనుభవిస్తున్నాడు. ఇక ఆమెను ఎక్కడికీ పోనివ్వకూడదన్న కామనతో అలాగే ముందుకు కదిలి కుడిచేయి పట్టుకున్నాడు.
ఏదో మధురమైన పులకింత ఇంతకాలం శరీరానికి కలిగిన గిలిగింత- ఇప్పుడు మనసుకు కలిగింది. ఆ బేధాన్ని అతను గుర్తించగలిగాడు.
అప్పుడు చూశాడు అతను ఆమె చేతిలోని క్యారియర్ ని తన కోసం తన క్షుద్భాద తీర్చడం కోసం గ్రామమంతా తృణీకరించి తనకోసం క్యారియర్ పట్టుకు వచ్చిన ఆమెను నీళ్ళు నిండిన కళ్ళలో చూస్తూండి పోయాడు.
అతన్ని ఆ స్థితిలో చూడడం ఇష్టంలేనట్టు ఆమె ఎంతో చొరవతో కన్నీళ్ళు తుడిచి "ముందు భోజనం" అంటూ చేయిపట్టుకుని లోనికి రమ్మన్నట్టు లాగింది.
అతను మౌనంగా అనుసరించాడు.