ఈ రాత్రి నీకు బహుమతి 13
పార్వతమ్మ ఎవర్నో చూసి తన భర్తనుకుంది అని సమాధాన పడింది.
మరుసటిరోజు తన భర్త రాగానే.... పెరట్లోకి లాక్కెళ్ళి "నిజమా! కానీ నేను నమ్మలేదు" అని ప్రారంభించి నిన్న జరిగినదంతా చెప్పింది.
"పార్వతమ్మకి కళ్ళు సరిగా కనిపించేటట్లు లేవు. కళ్ళద్దాలు కొనిస్తానని చెప్పు" అని ఒక్క వాక్యంతో బయటపడిపోయాడు.
అప్పట్నుంఛీ జాగ్రత్తలు పాటించాలనుకున్నాడు. అందుకే రాత్రుళ్ళు వెళ్ళడం మానుకున్నాడు. ఓ ఆదివారం చిన్నిని టౌన్ కి రమ్మని, ముసల్దాని ఇంట్లో కలుసుకున్నారు.
ఇలా రెండు మూడు నెలలు గడిచాయి.
ఓరోజు రాత్రి లాస్ట్ బస్ దిగి అత్తగారింటికి నడవడం మొదలుపెట్టాడు.
అప్పటికి చిన్నిని కలుసుకుని వారం రోజులైంది. మనసంతా పీకుతోంది. నరాలు రక్తప్రసరణకు అడ్డం పడుతున్నాయి. ఆమెతో గడిపిన ప్రతిక్షణం గుండెల్లో అలజడిని రేపుతోంది. ఆమె చిలిపితనం, పడకలో ఆమె చూపించే కొంటెతనం అన్నీ కళ్ళ ముందు పరుచుకుంటున్నాయి.
చిన్ని ఇల్లు వచ్చింది. దాన్ని దాటితే భార్య ఇల్లు.
అతనికి తెలియకుండానే అతని కాళ్ళు చిన్ని యింట్లోకి దారితీశాయి.