మోజు పడ్డ మగువ 9
ఆమె రెండేళ్ళ నుంచి సూర్యాదేవి తల్లి యింట్లో సేద్యగత్తెగా వుంటోంది. ఎనిమిది వరకు చదువుకుంది. ప్రపంచ జ్ఞానం ఇంకా ఎక్కువగానే వుంది.
అప్పుడప్పుడూ తను రాలేనప్పుడు కూతుర్ని చూసి యోగక్షేమాలు కనుక్కురమ్మని పంపిస్తుంటుంది సూర్యాదేవి తల్లి.
"ఏవీ శనగుండలు తీయ్"
సంచీలోంచి ఒకటి తీసిచ్చింది చామూ.
సూర్యాదేవి దాన్నందుకుని కొరికింది. తీయగా తగిలింది నాలుకకి. తన ఇల్లూ, తల్లీ, తమ పొలాలు అన్నీ కళ్ళముందు నిలిచాయి ఆమెకి.
అంతకు ముందున్న ఆందోళనంతా ఎగిరిపోయింది. ఏదో ప్రశాంతత మనసంతా అల్లుకుంది.
చిన్నప్పుడు ఆమె తలనొప్పిగా ఉందంటే నడివీధిలోకి వెళ్ళి కాస్తంత మట్టిని తీసుకొచ్చి దిష్టి తీసేది తల్లి. దిష్టివల్లో, లేక అభిమానానికి ఆలోచనలు మరోవేపుకు డైవర్టు అయ్యేయో తెలియదుగాని తలనొప్పి పోయేది. ఇప్పుడూ అలాగే శనగుండలు తింటూ ఊరూ, ఊర్లో తమ ఇల్లూ, ఇంటి పెరట్లో వుండే కొబ్బరిచెట్లూ, వాటి ఆకులు పట్టుకుని గెంతే చందమామా, పంటపొలాల నుండి వచ్చేగాలీ- ఇవన్నీ గుర్తొచ్చి మనసంతా తేలికయిపోయింది. జ్వరం తగ్గిన తరువాత రసం అన్నం తింటూ ఆ రుచిని శాంతంగా అనుభవించినట్లు అనిపిస్తోంది.
ఏదో తెలియని హుషారు శరీరంలో ఇమడలేక గుండెను గంతులేయిస్తోంది. నిముషం ముందు తనను కంగారు పెట్టిన సమస్యను తలుచుకుంటుంటే నవ్వొచ్చేంత ఈజ్ అయిపోయిందామె.
"చామూ! ఇంట్లోకి వెళ్ళి ఈ బ్యాగ్ పెట్టిరా జాలీగా అలా తిరిగొద్దాం" అంది.
"కార్లోనే" చాముండి కళ్ళను పెద్దవి చేసింది. కార్లో వెళ్ళడమంటే ఆమెకి మహాసరదా.