శృంగార నగరం 15
తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలా పరాయి మగాడిమీద వసంతం పోయడం అతను భరించలేకపోతున్నాడు. దీన్ని గమనించిన వెంకట్రామయ్య అతని భుజంపై బాధపడవద్దన్నట్లు చేత్తో చరిచాడు.
పునర్వసు అలా గోపాలకృష్ణమీద వసంతం పోయడాన్ని మిగిలిన జనం బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఆమెను ప్రోత్సహిస్తున్నట్లు చప్పట్లు చరిచారు.
ఆమె అటు వెళ్ళగానే మరో అమ్మాయి వసంతాన్ని అతనిమీద పోసింది. మళ్ళీ జనం ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. అతను అలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవడాన్ని చూసి పులిరాజు ఈర్ష్యతో ఉడికిపోతున్నాడు. ఊర్లో అతని డామినేషన్ చూసి వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతున్నాడు. కోపం కంటే ఈర్ష్య డేంజరస్. అందుకే పులిరాజు నిలువెల్లా దహించుకుపోతున్నాడు.
గోపాలకృష్ణకు నీళ్ళు పైన పడుతుండడం వల్ల ఊపిరి ఆడడం లేదు. కళ్ళల్లో సన్నటి మంట. అయితే దాన్ని లెక్క చేయకుండా మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వర్షవైపు చూస్తున్నాడు.
అతను అలా తనవైపే చూస్తున్నాట్లు భ్రమిస్తోంది ధాన్య.
"నా హీరో నావైపే చూస్తున్నాడు. అలా వెళ్లి కాసింత వసంతం చిలకరించి వస్తాను" అంది వర్షతో.