మోజు పడ్డ మగువ 29
ఎంతసేపటికి లేచామో తెలియదు.
ఒకరినొకరు చేతులు పట్టుకుని నడిచాం.
ఇల్లు దగ్గర పడుతుండగా చేతులు వదిలేశాం.
వాడు మౌనంగా వెళ్ళిపోయాడు.
నేను స్నానాల గదిలోకి దూరాను.
వాడు మా ఇంటిదగ్గర సేద్యానికి నిలిచిపోయి, ఫ్యాక్టరీకో వెళ్ళి పోతాడేమోనన్న శంక విచిత్రంగా మాయమైపోయింది. మళ్ళీ ఒంటరిగా ఆమైదానంలో మాట్లాడే తోడులేక పిచ్చి పడుతుందేమోనన్న భయం చిత్రంగా అదృశ్యమైపోయింది. అభద్రతా భావం తొలగిపోయింది.
నన్ను వాడెప్పటికీ వదిలిపెట్టి వెళ్ళలేడన్న నమ్మకం కలగడం వల్ల కాబోలు మొదటిసారి ఆ ఇంట్లో ఎనిమిది గంటలకల్లా నిద్ర ముంచుకొచ్చేసింది" అని చెప్పడం ముగించింది సౌందర్య.
కానీ చాలాసేపటి వరకు సూర్యాదేవి ఆ కథ మూడ్ లోనే వుండిపోయింది.
* * * * *
మరుసటిరోజు ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచింది సూర్యాదేవి. అప్పటికే సౌందర్య లేచి అన్ని పనులూ ముగించుకొని రెడీగా వుంది.
"గుడ్ మార్నింగ్ లేట్ గా లేచాననుకుంటా- ఎందుకనో ఈ మధ్య పొద్దుబోయిందాకా సరిగా నిద్ర రావడం లేదు"
"నిద్ర రావడంలేదంటే - మనకేదో తీరని అసంతృప్తీ - లేదూ జీవితమంటేనే భయమూ వున్నాయన్నమాట" అంది సౌందర్య.