మోజు పడ్డ మగువ 25
ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా తగ్గినట్లనిపించింది. హమ్మయ్య అని గుండెల్నిండా గాలి పీల్చుకుంది. బజారులో ఏవో రెండు మూడు కాస్మటిక్ ఐటమ్స్ కొని ఇంటికి వచ్చేసింది.
ఇంట్లో జగదీష్ లేడు. మోల్దింగ్ పోయాల్సిన పని వుందని రాత్రికి రానని చెప్పి వెళ్ళిపోయాడు.
సిటవుట్ లో చైర్ వేసుకుని కూర్చుని, పుస్తకం చేతబట్టుకుంది సూర్యాదేవి.
రాత్రి ఎనిమిది గంటల వరకు పుస్తకంతో గడిపి లైట్ గా భోజనం చేసింది. అన్నాకరేనినా సినిమా చూడాలని నిర్ణయించుకుంది. చాలా రోజుల్నుంచి చూడాలనుకుంటున్న సినిమా ఈ మధ్య ఎప్పుడో స్టార్ టీ.వీ.లో వచ్చిందిగానీ చూడలేకపోయింది. కేసెట్ అడిగితే వీడియో షాప్ లలో దొరకలేదు.
పదిగంటల వరకు పడుకుని, తర్వాత లేచొచ్చి టీ.వీ.ని ఆన్ చేసింది అప్పుడే మొదలౌతుంది సినిమా.
సినిమాలో లీనమైపోయింది సూర్యాదేవి.
పన్నెండు గంటలకి వసంత్ చెబుతానన్న థ్రిల్లింగ్ న్యూస్ ఏమిటో ఎంత ఆలోచించినా తట్టడం లేదు. ఇరవై నాలుగు గంటలపాటు అతనితో ప్రేయసిగా గడిపాక జగదీష్ తో తిరిగి ఎలా కాపురం చేయడం? అది జరిగే పనికాదు. వెళితే వెళ్ళిపోవాలి- శాశ్వతంగా తల్లిదండ్రుల్ని, భర్తనీ, వీటినన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలి.
నాతో వచ్చేయకూడదా అని వసంత్ ఎందుకడగలేదు. కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రం ప్రేయసిగా వుండాలని మాత్రం అడిగాడు. పర్మినెంట్ గా నాతో వచ్చేయమని అడిగితే- ఒప్పుకోనని అలా అడిగాడా? లేక ఇరవై నాలుగు గంటలు పైన తామిద్దరూ కలిసి గడపలేమని ఆ వరం అడిగాడా? ఇంతకీ తన నిర్ణయం ఏమిటి?