మోజు పడ్డ మగువ 21
ప్రేమించడం యింత అద్భుతంగా వుంటుందా అని ఆమెకి ఆమే అబ్బురపడి పోయేటట్లుంది. అంతలో వసంత్ రేపు వస్తానన్న విషయం గుర్తొచ్చింది.
వసంత్ చెప్పాడంటే యిక తిరుగుండదు. ఖచ్చితంగా వస్తాడు. కానీ తనకోసం వచ్చాడని ఎవరైనా పసికడితే ఇక అంతే సంగతులు. వసంత్ శవం పంటకాల్వలో తేలుతుంది. అందుకే తను వద్దన్నది. కానీ వింటేనా? ప్రేమముందు ప్రాణం సైతం విలువలేనిదిగా కనిపిస్తుందేమో? అందుకే ప్రేమలో ఏదయినా అనుకోనిది జరిగినప్పుడు ప్రాణం తీసుకుంటారు.
ఇంతకీ వసంత్ ఇస్తానన్న కేసెట్ ఏమిటి? ఆ పాట తనొక్కతే వినాలి. ఏదయినా అపురూపం అనుకున్నప్పుడు, దానిని తన కిష్టమైన వారితో పంచుకోవాలన్న కోరిక కలగడమే ప్రేమేమో?
మొత్తం కేసెట్ అంతా ఒకే పాట ఆట. ఇంతకీ ఆ పాట ఏమై వుంటుంది? సూర్యాదేవి అలా కళ్ళు మూసుకుని పడుకున్నప్పుడు యెవరో తనని పిలుస్తున్నట్లనిపించి లేచింది.
ద్వారం దగ్గర తల్లి నిలిచి వుంది.
"సూర్యా! అల్లుడొచ్చారు"
ఎందుకనో తెలియదుగానీ ఆవేళప్పుడు జగదీష్ రావడం ఇబ్బందిగా అనిపించింది సూర్యాదేవికి. ఇప్పుడామె ఒంటరితనాన్ని కోరుకుంటోంది. అర్చన చెప్పిన కథ, వసంత్ ఫోన్ చేయడం- ఇవన్నీ ఆమెను మరీ వత్తిడికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ ఒకరితో పంచుకునే వీలులేదు. అందుకనే ఆమె అయిష్టంగా ముఖంపెట్టి "ఎక్కడున్నారు?" అని అడిగింది.
"ఇప్పుడే వచ్చారు. బాత్రూమ్ లోకి వెళ్ళారు"
"సరే"