మోజు పడ్డ మగువ 19
నాకైతే అతను "నావాడు" అయిపోయాడు. ఆత్మీయతాభావం నాకు ఎక్కడా లేని శాంతిని ప్రసాదిస్తోంది. నా పేదరికం నన్ను బాధించడం మానేసింది. అందుకే నేను చాలా ఆనందంగా వున్నాను.
"సరుకులైపోయాయి. రెండు మూడు రోజులకి వస్తాయేమో. రేపు తెప్పించు" ఇప్పుడు అతను పరాయివాడు కాదు కాబట్టి మునుపటిలా అతని నుంచి సహాయం పొందడం ఇబ్బందిగా లేదు. మామూలుగా అయితే సరుకులు కావాలని చెప్పడానికి చాలా గంటలు ప్రిపేర్ అయి, అతికష్టం మీద కంఠతా పెట్టింది ఒప్పజెప్పినట్లు చెప్పి, చూపుల్ని కిందకు దించేసి గిల్టీనెస్ తో నల్లబడ్డ ముఖం కనిపించకుండా అష్టవంకర్లు పోయేదాన్ని ఇప్పుడవన్నీ పోయాయి.
"అలానే"
అతను పైకి లేచాడు.
"నువ్వు ఇకనుంచి ఉదయం నిద్ర లేస్తూనే ఇక్కడికిరావాలి. నువ్వు లేకుండా కాఫీ తాగకూడదని నిర్ణయించుకున్నాను. నువ్వెప్పుడొస్తే అప్పుడే నాకు కాఫీ"
ఏమీ మాట్లాడకుండా అతను వెళ్ళిపోయాడు.
రెండో రోజునుంచి క్రమం తప్పకుండా కాఫీ వేళకు వస్తున్నాడు. కానే మునుపటిలా క్లోజ్ గా మాట్లాడలేకపోతున్నాడు. కొత్త విషయం చొరబడడం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. అది నేను గ్రహించడంవల్ల ఇంకాసేపు వుండమనికానీ, ఇంకా మాట్లాడమనీ ఒత్తిడి చేయడం లేదు.
అంతలో కార్తీకమాసం వచ్చింది.
కార్తీక సోమవారానికి కపిలతీర్ధంలోని శివాలయానికి ఆడవాళ్లు చాలామందే వెళ్ళి వస్తున్నారు.