మోజు పడ్డ మగువ 17
సూర్యాదేవి చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. కానీ పట్టు సడలించలేదు. నాలుక కొస ఎదకు తాకింది. మరుక్షణం బరిసె గుండెల్లోకి దిగుతున్నట్లు మంట రక్తం బుసబుసా పొంగుతోంది.
ఆమె దానిని పట్టించుకోకుండా గట్టిగా లాగింది.
నాలుక ఆ ఆకారం నోట్లోంచి పూడిపోయింది. మరుక్షణం అది సాగడం ఆగిపోయింది. తనకు ప్రమాదం తప్పిపోయిందని ఆమెకి అనిపించింది. ఆ ఆకారాన్ని పట్టుకోవడానికి ముందుకి దూకింది.
ఇది గ్రహించి ఆ ఆకారం వెనక్కు తిరిగి కిందకు పరుగెత్తింది. దాంతో పాటు ఆమె కూడా ముందుకు వురికింది. చేతులమధ్య ఒళ్ళు జలదరించేలా ఎర్రగా, పాములా వున్న ఆ ఆక్రం నాలుక వుండడం వల్ల ఆమె ఇక పరుగెత్తలేక పోయింది.
ఆ ఆకారం వెనక ద్వారం తెరుచుకుని ప్రహరీ గోడను ఎగిరి దూకి చీకట్లో కలిసిపోయింది.
ఇదంతా గుర్తించినట్లు కుక్క అరుస్తోంది.
ఆమె వెనక ద్వారం దగ్గరికి వచ్చి నిలిచిపోయింది. ఇక ఆ ఆకారాన్ని పట్టుకోవడం సాధ్యం కాదు.
ఇదంతా కలకాదు అని చెప్పడానికే వున్నట్లు చేతుల్లోని నాలుకను నింపాదిగా చూసింది. జరిగిందంతా తలుచుకుంటుంటే ఒళ్ళు జలదరించింది.
భయం మళ్ళీ కమ్ముకోవడంతో చేతుల్లోని నాలుకను దూరంగా విరిసికొట్టింది.
అది బోగన్ విల్లా పొదల మధ్య పడింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు.