మోజు పడ్డ మగువ 16
పుస్తకాన్ని పక్కకి విసిరికొట్టింది.
ఆమెకీ, అతనికీ ఏ విషయంలోనూ అభిప్రాయాలు కుదరవు. అలవాట్లకు పొంతన లేదు. ఆమెకి లైటుంటేగానీ నిద్రరాదు. అతనికి లైటు లేకుంటేనే నిద్రొస్తుంది. ప్రతిరోజూ ఈ విషయం మీద అసంతృప్తి ప్రకటించడమో, ఘర్షణ పడడమో, మూతిముడుచుకోవడమో జరుగుతుంటుంది.
ఆమెకి లేటుగా నిద్రపోయి, ఆలస్యంగా నిద్ర లేవడం ఇష్టం. అతనేమో దీనికంటే పూర్తిగా భిన్నం. త్వరగా నిద్రపోయి, త్వరగా లేవడం అతని అలవాటు అందుకే యిద్దరు వ్యక్తులను పెళ్ళి చట్రంలో బిగించి, కలిపి బతకండని ఓ యింట్లో తోసెయ్యడం దారుణం అని ఆమె ప్రతి నిమిషమూ అనుకుంటూ ఉంటుంది.
అసలు ఇద్దరి అభిరుచులు కలవడం ఎప్పటికీ కుదరదు. అందుకే భార్యా భర్తల మధ్య రాజీ సూత్రాన్ని పాటించాలంటారు. ఏవో వస్తుంటాయి సర్దుకుపోవాలి అని పెద్దలు అనడంలో ఉద్దేశ్యం ఇదే!
ఇలా సర్దుకుపోవడానికి ఎదుటి వ్యక్తి మీదే ప్రేముండాలి, కానీ ఎంతమందికి తమ జీవితపు సహచరుల మీద ప్రేముంది?
తనకు జగదీష్ మీద లవ్ వుందా అని ఆలోచించింది. ఆమెకు ఉన్నట్లు అనిపించలేదు.
ప్రేమ అనేదే ఉంటే ఇంతగా తామిద్దరూ సఫర్ అవుతారా?
అసలు ప్రేమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు వసంత్ ఏమని సమాధానం చెబుతాడు? మొత్తం జీవితాన్ని పాదాల ముందు పరిచెయ్యడమా? మరొకటి ఏదీ గుర్తుకు రాకుండా చేసుకోవడానికి యెదుటి వ్యక్తి పేరును కోటిసార్లు రాయడమా? లేదూ ప్రియబాంధవి చెప్పినట్లు తెల్లారగట్ట ముసుగును తొలగిస్తూనే గుర్తుకు రావడమా?