మోజు పడ్డ మగువ 12
"నా టాలెంట్ నా చదువూ సంఘానికి ఉపయోగపడకుండా పోతోంది కదా" అంది.
"ఏం ఫరవాలేదు. హ్యాపీగా ఇంట్లో వుండు" అని ఇక ఆ తరువాతెప్పుడూ ఆ టాపిక్ కి ఆస్కారం ఇవ్వలేదు.
అలా ఆమె దేనికైతే ఆరాటపడిందో అది నెరవేరలేదు. ఇంటికి పరిమితమైపోయింది.
ఇలా హమేషా ఒక్కడికోసమే ఇల్లు కనిపెట్టుకుని వుండడమంటే అసహ్యమేసేది. తను ఎమోషన్స్ ను బయటపెట్టుకునే సమయంగానీ, మనిషిగానీ ఆమెకీ చిక్కేది కాదు.
భర్త అంటే గుడ్ కంపానియన్ లా వుండాలని ఆమె కోరుకుంది. మంచి పొయిట్రీ చదివితే ఆ అనుభూతినంతా మరొకరితో పంచుకోవాలనుండేది. మంచి నవల చదివినప్పుడు అందులోని వస్తువు, శిల్పం మీద మాట్లాడాలని చూసేది. వెన్నెల్లో తడుస్తూ తనతోపాటు ప్రకృతిలో లీనమై పోయే తోడు కోసం వెదికేది.
తత్త్వ చింతన చేస్తూ ఈ ప్రపంచపు పునాదుల మీద చర్చ జరగాలని ఆశించేది. కానీ అతను తప్ప మరొకరు కనిపించని ఆ పెద్ద ఇంట్లో అన్నీ ఆమే దిగమింగుకునేది. ఓ విధంగా ఇంట్రావర్టుగా తయారైంది. తన ఫీలింగ్స్ నన్నీ తనలోనే నొక్కిపట్టి వుంచింది.
ఇదిగో ఇన్నేళ్ళకి ఆమెను వసంత్ కదిలిస్తున్నాడు. అతనికోసం అన్నిటినీ త్యజించుకునే సమయం మించిపోయింది. ఒక్కతే కాలంతో పాటు ఎంతో దూరంగా ప్రయాణం చేసింది. కానీ ఆమె సహజ ప్రవృత్తి ఈ బంధాలన్నీ తెంచుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ వుంది. అందుకే ఆమె మొదటిసారి అంత వేదనకూ, టెన్షన్ కూ గురవుతూ వుంది.