ఈ రాత్రి నీకు బహుమతి 8
"నేనా!" అంది అదో విధంగా సిగ్గులాంటి భయం కళ్ళల్లో కదలాడింది.
"నువ్వే- నవ్వు అడిగితే తప్ప ఇవ్వడు. సాయంకాలానికి డబ్బు అందకపోతే ఆ సుభాషిణి నోటికొచ్చినట్టు కడిగేస్తుంది"
ఇష్టం లేనట్టు ముందుకు సాగింది సుమతి.
అప్పుడు టైం మధ్యాహ్నం రెండు గంటలయింది. గాలి మధ్యాహ్నం నిద్రకు అలవాటుపడినట్టు ఎక్కడా అలికిడి లేదు. చలి అంటుకున్న ఎండ అంత తీక్షణంగా లేదు.
పక్కిల్లే అయినా ఆ ఇంటికి నడిచేసైరకి సుమతికి పదినిమిషాలు పట్టింది.
నారాయణది పెద్ద అడ్డాపిల్లు. తలుపు కొద్దిగా మూసుంది.
అక్కడికెళ్ళి కాసేపు నిలుచున్నా లోపల ఎవరూ వున్నట్టు అలికిడి లేదు.
"ఏమండీ!" మెల్లగా పిలిచింది.
ఎవరూ పలకలేదు.
ఈసారి మరింత గట్టిగా పిలిచింది.
"ఎవరూ?" అంటూ నారాయణ లోపలి నుంచి వచ్చాడు.
ఎదురుగ్గా సుమతిని చూసి అతను తడబడ్డాడు.
తండ్రి భోజనం చేసి పొలం వెళ్ళాడు. ఇక ఆయన సాయంకాలమే తిరిగి వచ్చేది.
"రా" అంటూ లోపలికి పిలిచాడు.