ఈ రాత్రి నీకు బహుమతి 14
అప్పటికే గోకుల్ పొలం దగ్గరికి వచ్చి దాదాపు గంటైంది. ఈరోజు వస్తుందో రాదోనన్న బెంగ అతన్ని కాల్చుకుతింటోంది.
ఆమె వస్తుందన్న ఆశ ఎక్కడో మిణుకుమిణుకుమంటోంది. రాదేమోనన్న నిరాశ కాగడలాగా మండుతోంది.
ఒక్క క్షణం కాలు నిలవడంలేదు.
మాటిమాటికీ ఏటివైపు చూస్తున్నాడు.
కొన్ని ఏళ్ళపాటు ఘోరమైన తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భక్తుడు ఎలా పొంగిపోతాడో అలా అతను జర్క్ ఇచ్చాడు.
కెరటం తీరం దాటి వస్తున్నట్టు దూరంగా పద్మజ ఏటిగట్టు దిగుతుండడం అతనికి కనిపించింది.
కానీ తను ఇలా వెయిట్ చేస్తున్నట్టు ఆమె కనిపెట్టడం అతనికీ ఇష్టం లేదు.
అందుకే పాకలోకి వెళ్ళి పుస్తకం తెరిచాడు.
పద్మజ పొలం దగ్గరికి వచ్చింది.
పొలంలో ఎవరో ఒకరు వున్నట్టు ఆమె కూడా ఏటిగట్టు దిగుతున్నప్పుడు గమనించింది.
అతను గోకుల్ అని పోల్చుకోగలిగింది.
మరి ఇప్పుడు ఎవరూ లేకపోవడంతో తమ పొరబాటు పడ్డానేమో నన్న అనుమానం వచ్చింది.