మోజు పడ్డ మగువ 3
"ఆఁ" అతను భయంతో బిగదీసుకుపోయి, అంతలో తేరుకుని, "ఏమిటీ!" అంటూనే ఎడమచేత్తో నుదురుపై భాగాన్ని తడుముకున్నాడు.
ఏదో వుబ్బుగా తగిలినట్లనిపించింది.
"నిజమండీ! మీ నెత్తిమీద కొమ్ములు మొలుస్తున్నాయి" అంది సూర్యాదేవి.
అతను అద్దంలో చూసుకోవడానికి డ్రస్సింగ్ మిర్రర్ వైపు పరుగెత్తాడు.
* * * * *
ఆరోజు ఆదివారం సాయంకాలం ఐదుగంటలకల్లా రెడీ అయి పోయింది సూర్యాదేవి.
ఆమెకు సుస్మిత అనే ఓ స్నేహితురాలుంది. మంచి ఆర్టిస్ట్ తను గీసిన చిత్రాలన్నిటినీ గెస్ట్ లైన్ డేస్ హోటల్ లో ప్రదర్సనకు పెడుతున్నాననీ, ఓసారి వచ్చి వెళ్ళమనీ ఉదయం ఫోన్ చేసి చెప్పింది. ఏవో పనుల వల్ల ఉదయం నుంచీ వెళ్ళడానికి కుదరలేదు. సాయంకాలం ఆరుగంటల కల్లా ప్రదర్శన అయిపోతుంది కాబట్టి త్వరత్వరగా తయారైంది.
"కమాన్ సూర్యా! ఇప్పటికే ఆలస్యమైంది" హడావుడిగా కిందకు దిగుతూ చెప్పాడు.
"మీవల్లే ఆలస్యం, స్నానం చేస్తానని బాత్రూమ్ లో దూరిన మీరు రావడం ఇంకో అరగంటకు ఆర్ట్ ఎగ్జిబిషన్ ని మూసేస్తారు"